
దుబాయ్: టీ20 ఫార్మాట్‌లో ఐసీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇంత కాలం జట్లు స్లోగా బౌలింగ్ చేస్తే మ్యాచ్ ముగిసిన అనంతరం టీంలోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో స్లో ఓవర్ రేట్ కారణంగా కోత విధించేది. అయితే మ్యాచ్ ఫీజులు, వార్నింగ్‌లతో జట్ల తీరులో మార్పు రాకపోవడంతో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మ్యాచ్ జరగుతుండానే చేసిన తప్పునకు శిక్ష వేయనుంది. ఈ మేరక ఐసీసీలోని కమిటీ పెద్దలు కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. వాటిని ఐసీసీ తాజాగా ప్రకటించింది.
ఐసీసీ రూల్స్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఫీల్డింగ్ చేసే జట్టు బౌలింగ్ తమకు కేటాయించిన నిర్ణీత సమయంలోనే టీ20 మ్యాచ్‌లో చివరిదైన 20వ ఓవర్ వేయాలి. లేదంటే 30 గజాల సర్కిల్ వెలుపల నిర్దేశించిన ఫీల్డర్ల కంటే ఒక ఫీల్డర్‌ను తక్కువగా అనుమతిస్తారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 20వ ఓవర్ బౌలింగ్ చేసే సమయంలో 30 గజాల సర్కిల్ వెలుపల ఐదుగురు ఫీల్డర్లు ఉండొచ్చు. కానీ ఐసీసీ తాజాగా తెచ్చిన నిబంధనలతో నిర్ణీత సమయం లోపల 20వ ఓవర్ వేయకుంటే 30 గజాల సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లే ఉండాలి. అప్పుడు బౌలింగ్ చేసే జట్టుకు ఇది మైనస్‌గా మారుతుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడడానికి వీలు కల్పిస్తుంది. దీంతో ఇది బ్యాటింగ్ చేసే టీంకు అనుకూలించడం వల్ల ఫీల్డింగ్ టీంకు నష్టం చేకూరనుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఫీల్డింగ్ జట్టు నిర్ణీత సమయం లోపల తమ బౌలింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా ఈ నిబంధనను ఇటీవల ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంగ్లాండ్‌లో ముగిసిన హండ్రెడ్ లీగ్‌లో అమలు చేసింది. అక్కడ ఇది సక్సెస్ కావడంతో ఐసీసీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోనూ ప్రవేశపెట్టింది.
ఈ రూల్ పురుషులతోపాటు మహిళల టీ20 ఫార్మాట్‌లోనూ ఐసీసీ ఈ నెల నుంచే అమలు చేయనుంది. ఈ నెల 16 నుంచి వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే టీ20 మ్యాచ్‌తో ఈ కొత్త రూల్ అమలులోకి రానుంది. ఇక మహిళల విషయానికొస్తే ఈ నెల 18 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగే టీ20 మ్యాచ్‌తో అమలులోకి రానుంది. ఇక టీమిండియాకు ఈ రూల్ ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుంది. అంతేకాకుండా మ్యాచ్ టైంలో ఇరు జట్లు ఒక సారి డ్రింక్స్ బ్రేక్ తీసుకోవచ్చు. అయితే ఇది సిరీస్ ప్రారంభానికి ముందు ఆయా టీంల ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది.