సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్‌లో విజయంతో జోరు మీదున్న టీమిండియాకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) షాకిచ్చింది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. అంతేగాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్లోనూ ఒక పాయింట్ కోత విధించింది. తొలి టెస్ట్‌లో టీమిండియా చాలా నెమ్మదిగా బౌలింగ్ చేసిందని మ్యాచ్‌లో అంపైర్లుగా వ్యవహరించిన మరైస్ ఎరాస్మస్, ఆడ్రియన్ హోల్డ్ స్టాక్, అల్లాహుదీన్ పాలేకర్, బొంగానీ జీలేలు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ ఆండ్రూ పైక్రాఫ్ట్ భారత జట్టు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేసిందని నిర్దారించారు.
దీంతో ఐసీసీ పురుషుల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్లేయింగ్ కండిషన్స్లోని ఆర్టికల్ 16.11 ప్రకారం టీమిండియా నిర్దేశించిన సమయం వరకు ఒక ఓవర్ తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం 53 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా ఖాతాలోఒక పాయింట్ కోత పడనుంది. కాగా సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఖాతాలో 12 పాయింట్లు చేరిన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం టీమిండియా ఆటగాళ్లందరికీ స్లో ఓవర్ రేట్ కారణంగా 20 శాతం జరిమానా విధించారు. కాగా స్లో ఓవర్ రేట్ విషయాన్ని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అంగీకరించనట్టు ఐసీసీ తెలిపింది. కాబట్టి దీనిపై ఎలాంటి విచారణ అవసరం లేదని అందుకే ఫైన్ విధించినట్టు పేర్కొంది.
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్ర స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 100 శాతం విజయాలతో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో శ్రీలంక ఉంది. ఇక మూడో స్థానంలో 75 శాతం విజయాలతో పాకిస్థాన్ ఉంది. 63 శాతం విజయాలతో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఇప్పటివరకు 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు నాలుగింట్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకోగా, ఒక దాంట్లో ఓడిపోయింది.