
ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (50) కోలుకున్నారు. లారా ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లారా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది, అతన్ని డిశ్చార్జ్ చేసాం అని ముంబయిలోని గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
'ఛాతీ నొప్పి రావడంతో వైద్యులను సంప్రదిస్తే మంచిదని ఆస్పత్రికి వచ్చా. వైద్య పరీక్షల అనంతరం ఎలాంటి ప్రమాదమూ లేదని డాక్టర్లు తెలిపారు. ఆస్పత్రి నుంచి ముంబైలో బస చేస్తున్న హోటల్‌కి చేరుకున్నా' అని లారా తెలిపారు. ప్రపంచకప్ విశ్లేషకుడిగా స్టార్ స్పోర్ట్స్ సంస్థ కోసం భారత్ నుంచి లారా పని చేస్తున్నాడు. ప్రపంచకప్ నేపథ్యంలో ముంబైలోని స్టార్‌స్పోర్ట్స్ స్టూడియోలో డగౌట్ ప్యానెల్‌లో నిపుణుడిగా ఉన్న లారా కొద్దిరోజులుగా భారత్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు. ప్రస్తుతం లారా కోలుకుని హోటల్‌కి చేరుకున్నాడు. ఈ రోజు విండీస్-భారత్ మ్యాచ్‌కి కామెంటరీ చేయనున్నాడని సమాచారం.
లారా అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియగానే స్టార్ స్పోర్ట్స్ అధికారులు గ్లోబల్ ఆస్పత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రెండేళ్ల కిందట అతడికి స్టెంట్ వేశారు. అంతకుముందు విండీస్ క్రికెట్ బోర్డు లారా మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేసింది. లారా మాట్లాడుతూ... ' నాకు ఏమైందని ప్రతిఒక్కరూ చాలా ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. ఈ రోజు ఉదయం జిమ్ లో ఎక్కువ సమయం గడిపా. ఛాతి నొప్పి వచ్చింది. వైద్యులకు చూపించాలనుకున్నా. అక్కడ చాలా టెస్టులు చేసారు. ప్రస్తుతం బాగానే ఉన్నా. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ చూస్తున్నాను' అని లారా తెలిపారు.