
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా డోప్ టెస్టుకు హాజరయ్యాడు. ప్రపంచకప్ ఆడుతున్న ఆటగాళ్లకు నిర్వహిస్తున్న డోప్ పరీక్షల్లో భాగంగా సోమవారం బుమ్రాకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) డోప్ టెస్టు నిర్వహించింది. వాడా పరిధిలోని ఓ ఏజెన్సీ బుమ్రా మూత్ర నమూనాలు సేకరించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
బుమ్రాతో పాటు ఇతర టీమిండియా ఆటగాళ్లు నమూనాలు ఇచ్చేందుకూ అవకాశం ఉంది. డోప్ టెస్టులను కొందరి ఆటగాళ్లకు మాత్రమే నిర్వహించాలని ఎలాంటి నిబంధన లేదు. వాడా తనకు నచ్చిన ఏ ఆటగాడినైనా ఈ టెస్ట్ నిర్వహిస్తుంది. అయితే వాడా అడిగిన వెంటనే.. ఏ ఆటగాడైనా సహకరించాల్సిందే.
ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో బుధవారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో బుమ్రాకు డోప్ టెస్ట్ నిర్వహించారు. టీమిండియాకు బుమ్రా కీలక బౌలర్. మాజీ ఆటగాళ్లు సచిన్, థాంసన్ కూడా ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ అంటూ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు.
తొలి మ్యాచ్‌కు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్స్ లో శ్రమిస్తున్నారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కెఎల్ రాహుల్ నెట్స్ లో బ్యాటింగ్ సాధన చేశారు. దీని బట్టి 4వ స్థానంలో రాహుల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెట్ ప్రాక్టీస్ వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.