
హైదరాబాద్: టీమిండియాపై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ ఘోరంగా ఓడిపోవడంపై అఫ్రిది ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
"ఓ గొప్ప విజయం సాధించినందుకు బీసీసీఐకి అభినందనలు. మీ క్రికెట్ ప్రమాణాలు చాలా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. మీరు వరుస విజయాలు సాధించడానికే ఐపీఎల్ ప్రధానం కారణం. పాక్‌పై మీరు సాధించిన విజయం క్రెడిట్ అంతా ఐపీఎల్‌కే దక్కుతుంది" అని ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.
"ఐపీఎల్ ద్వారా కేవలం ఆటగాళ్ల నైపుణ్యం బయటకు రావడంతో పాటు ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లకు ఎలా సన్నద్ధం కావాలనే విషయాన్ని భారత యువ క్రికెటర్లు బాగా తెలుసుకున్నారు. దీంతోనే ఆ జట్టు అద్భుత విజయాలు సాధించడం పరిపాటిగా మారింది" అని అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు.
అంతకముందు మ్యాచ్‌లు గెలవాలంటే 40 నుంచి 50 పరుగులు చేస్తే సరిపోదని, వాటిని భారీ స్కోర్లుగా మలుచుకున్నప్పుడే విజయాలు సాధ్యమనే విషయం గుర్తించుకోవాలని పాకిస్థాన్ జట్టుని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. విజయాలు సాధించాలంటే నిలకడగా ఆడటంతో పాటు మైదానంలో ప్రశాంతంగా ఉండటం కూడా ఎంతో ముఖ్యమని చెప్పాడు.
ముఖ్యంగా ఫీల్డింగ్ అనేది మ్యాచ్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషిస్తుందని, 70 నుంచి 80 శాతం మ్యాచ్‌లు ఫీల్డింగ్‌తోనే గెలుస్తాయనే విషయం తెలుసుకోవాలని అఫ్రిది ఈ సందర్భంగా పాకిస్థాన్ జట్టుకు సూచించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది.
ఈ విజయంతో భారత్ వరుసగా ఏడో సారి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.