
ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్టల్ మైదానంలో పరుగుల వరద పారింది. ఇరు జట్ల బ్యాట్స్‌మన్‌లు చెలరేగి ఆడటంతో మ్యాచ్‌లో మొత్తం 751 పరుగులు నమోదయ్యాయి. బ్యాట్స్‌మన్‌ల దాటికి మాట్ హెన్రీ, ఒశానే థామస్ లాంటి బౌలర్లు కూడా ఓవర్‌కు 11కు పైగా పరుగులు సమర్పించుకున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మొదటగా బ్యాటింగ్ చేసిన విండీస్ 49.2 ఓవర్లలో 421 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మన్ చెలరేగి ఆడారు. ఓపెనర్లు క్రిస్ గేల్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎవిన్ లూయీస్ (54 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్)లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అనంతరం షై హోప్ (86 బంతుల్లో 101; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఇక ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్ హోల్టర్ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. కివీస్ బౌలర్ బౌల్ట్ నాలుగు వికెట్లు దక్కాయి.

ఛేదనలో కివీస్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు గుప్తిల్ (5), నికోలస్ (15) నిరాశపరిచారు. రాస్ టేలర్ (2) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో వికెట్ కీపర్ బ్లండెల్ (89 బంతుల్లో 106; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ, కెప్టెన్ విలియమ్సన్ (64 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం మరెవరూ క్రీజులో నిలవకపోవడంతో న్యూజిలాండ్ 47.2 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్ వైట్ మూడు వికెట్లు తీసాడు.