
1992 ప్రపంచకప్.. 43 పరుగులతో విజయం:
1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరిగింది. భారత్, పాకిస్థాన్ తొలిసారి తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన మహ్మద్ అజహరుద్దీన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సచిన్ (54; 62 బంతుల్లో 3x4) అర్ధ శతకం చేసాడు. టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ 48.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 43 పరుగులతో విజయం సాధించింది.

1996 ప్రపంచకప్.. 39 పరుగులతో గెలుపు:
1996 ప్రపంచకప్ సొంత గడ్డపై జరిగింది. ఇరు జట్లూ రెండోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన భారత్.. 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. ఓపెనర్ సిద్దూ (93; 115 బంతుల్లో 11x4) శతకంకు దగ్గరలో పెవిలియన్ చేరాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్ 248 పరుగులే చేసింది. భారత్ 39 పరుగులతో విజయం అందుకుంది. అనిల్ కుంబ్లే, ప్రసాద్ తలో మూడు వికెట్లు తీసారు.

1999 ప్రపంచకప్.. 47 పరుగులతో విజయం:
1999 ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లో జరిగింది. మాంచెస్టర్ వేదికగా భారత్, పాక్ మూడోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. రాహుల్ ద్రవిడ్ (61;89 బంతుల్లో 4x4) అర్ధ శతకం చేశాడు. లక్ష్య ఛేదనలో వెంకటేశ్ ప్రసాద్ ఐదు వికెట్లతో చెలరేగడంతో పాక్ 180 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 47 పరుగులతో విజయకేతనం ఎగురవేసింది.

2003 ప్రపంచకప్.. 6 వికెట్లతో గెలుపు:
దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్‌లో రెండు జట్లు నాలుగోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసి ఏడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. సయీద్ అన్వర్ (101; 126 బంతుల్లో 7x4) శతకం చేసాడు. అనంతరం ఛేదనలో సచిన్ (98; 75 బంతుల్లో 12X4, 1x6) ఆదుకున్నాడు. ఆకర్లో యువీ (50; 53 బంతుల్లో 6x4) అర్ధ శతకం చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

2011 ప్రపంచకప్.. 29 పరుగులతో విజయం:
భారత్‌లో జరిగిన 2011 ప్రపంచకప్‌లో ఐదోసారి తలపడ్డాయి. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సచిన్ (85; 115 బంతుల్లో 11x4) మరోసారి అర్ధ శతకం చేసాడు. లక్ష్య ఛేదనలో పాక్ 231 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ (56; 76 బంతుల్లో 5x4,1x6) అర్ధ శతకంతో చెలరేగినా.. పాక్ జట్టును కాపాడలేకపోయాడు. జహీర్‌ఖాన్, ఆశిశ్ నెహ్రా, మునాఫ్ పటేల్, హర్భజన్‌సింగ్, యువరాజ్ సింగ్ తలో రెండు వికెట్లు తీయడంతో.. టీమిండియా 29 పరుగులతో జయకేతనం ఎగురవేసింది.

2015 ప్రపంచకప్.. 76 పరుగులతో గెలుపు:
ఆస్ట్రేలియాలో జరిగిన ఈ టోర్నీలో ఆరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (107; 126 బంతుల్లో 8x4) శతకం చేసాడు. శిఖర్ ధావన్ (73), సురేశ్ రైనా (74) లు కూడా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 300 భారీ స్కోరు సాధించింది భారత్. లక్ష్యఛేదనలో పాక్ 224 పరుగులకే కుప్పకూలింది. మిస్బా ఉల్ హాక్ (76; 84 బంతుల్లో 9x4, 1x6) మరోసారి మెరిసినా.. ఫలితం లేకపోయింది. 76 పరుగులతో టీమిండియా గెలుపు అందుకుంది.


Click it and Unblock the Notifications
