
మాంచెస్టర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం మొదలైన మొదటి సెమీస్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డ విషయం తెలిసిందే. బుధవారం ఈ మ్యాచ్ మొదలైంది. మంగళవారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (67), లాథమ్ (3)లు ఉన్నారు.
అయితే రిజర్వ్ డే రోజున ఆట ఎలా ఉండనుంది?. అందులో వర్తించే షరతులు, నిబంధనలేంటి అనే విషయాలపై చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. మ్యాచ్ ఆగిపోయిన రోజే వర్షం కనికరిస్తే.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఓవర్లను కుదించి ఆడిస్తారు. మంగళవారం ఇది సాధ్యం కాలేదు కాబట్టి.. రిజర్వ్‌డే రోజున మ్యాచ్ ఆడుతుంది. రిజర్వ్‌డే రోజున తొలిరోజు ఆట ఎక్కడ ఆగిపోయిందో తిరిగి అదే ఓవర్ నుంచి మొదలవుతుంది. మొత్తం 50 ఓవర్లనూ ఆడిస్తారు.
రిజర్వ్ డేలో కూడా వర్షం వస్తే ఓవర్లను కుదించి ఆడిస్తారు. డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు. డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం టీమిండియా టార్గెట్ ఇలా ఉండనుంది.
# 46 ఓవర్లు - లక్ష్యం 237 పరుగులు.
# 40 ఓవర్లు - 223 పరుగులు
# 35 ఓవర్లు - 209 పరుగులు
# 30 ఓవర్లు - 192 పరుగులు
# 25 ఓవర్లు - 172 పరుగులు
# 20 ఓవర్లు - 148 పరుగులు
డక్ వర్త్ లూయీస్ వర్తిస్తే .. టీమిండియా మరింత కష్టపడాల్సి ఉంటుంది. తక్కువ సమయం ఉండి కేవలం 20 ఓవర్లు మాత్రమే టీమిండియాకు కేటాయించే పరిస్థితి వస్తే జట్టుపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఒకవేళ 20 ఓవర్లు టీమిండియా ఆడాల్సి వచ్చి.. మధ్యలో వర్షం పడితే ఇక డక్‌వర్త్ లూయీస్ వర్తించదు. మ్యాచ్‌ను రద్దు చేసి లీగ్ దశల్లో ఎక్కువ పాయింట్లు, రన్ రేట్ ఆధారంగా ఫైనల్‌కు వెళ్లే జట్టును ప్రకటిస్తారు.