
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 24 పరుగులకే భారత్ కీలక నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో పరుగులు చేయడానికి భారత్ బ్యాట్స్‌మన్ ఆపసోపాలు పడుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లు మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్‌లు నిప్పులు చెరిగే బంతులేశారు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కేవలం 24 పరుగులు మాత్రమే చేయడంతో ఈ ప్రపంచకప్‌లో పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా భారత్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇదే మ్యాచ్‌లో కివీస్ 27 పరుగులు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఇక లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై భారత్ చేసిన 28 పరుగులు పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు కాగా.. కివీస్ దాన్ని సవరించి చెత్త గణాంకాలను నమోదు చేసింది. ఇక బంగ్లాపై పాక్ 31 పరుగులు చేసింది.
కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ షాక్ ఇచ్చాడు. నాలుగు బంతులు ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (1; 4 బంతుల్లో) ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన 2.4వ బంతిని ఆడే క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (1; 6 వికెట్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ సమీక్ష కోరినా.. ఫలితం లేకుండా పోయింది.
దీని నుంచి తేరుకోకముందే మాట్ హెన్రీ మరో షాక్ ఇచ్చాడు. హెన్రీ వేసిన 3.1వ బంతికి కేఎల్ రాహుల్ (1; 7 బంతుల్లో) ఔటయ్యాడు. కీపర్ టామ్ లేథమ్ అద్భుత క్యాచ్ పట్టాడు. దీంతో టీమిండియా 5 పరుగులకే కీలక ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇది చాలదన్నట్టు భాద్యతగా ఆడాల్సిన దినేష్ కార్తీక్ (6; 25బంతుల్లో) ఔట్ అయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో జేమ్స్ నీషమ్ సూపర్ క్యాచ్ పట్టడంతో కార్తీక్ పెవిలియన్ చేరాడు. దీంతో 24 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు. రిషబ్ పంత్ (31), హార్దిక్ పాండ్యా (22)లు క్రీజులో ఉన్నారు. భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.