
ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రెండో రోజు (రిజర్వ్‌డే)కు వాయిదా పడటం ఇది రెండోసారి. 1999లో మొదటిసారి భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డేకు వాయిదా పడింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్-2019లో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డేకు వాయిదా పడింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
1999 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. అప్పటి ప్రత్యర్థి ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టే. అయితే ఆ మ్యాచ్‌లో భారతే గెలవడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లకు 232 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 20.3 ఓవర్లలో 73/3తో ఉండగా.. వర్షంతో మ్యాచ్ ఆగింది. మరుసటి రోజు ఆటను అదే స్కోర్ నుంచి కొనసాగించారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ 169 పరుగులుకే ఆలౌట్ అయింది. ప్రస్తుత ప్రత్యర్థి న్యూజిలాండ్. కివీస్ మొదట బ్యాటింగ్ చేస్తుండగా వర్షం అంతరాయం కలిగించింది. మరి సెంటిమెంటు కలిసొచ్చి తాజా మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాదిస్తుందేమో చూడాలి.
ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వ్‌డే (బుధవారం)కు వాయిదా పడింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మరో నాలుగు ఓవర్లలో ముగుస్తుందనుకున్న సమయంలో చిరుజల్లులతో మొదలైన వర్షం అనంతరం భారీగా పడడంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక పలు మార్లు వర్షం వచ్చి వెళుతుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను బుధవారంకు వాయిదా వేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (67), లాథమ్ (3)లు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్ బ్యాటింగ్‌తో మ్యాచ్ మొదలవుతుంది.