
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒకే వేదికపై కనిపించి భారత అభిమానులను అలరించారు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఇద్దరూ వీక్షించారు. సచిన్, పిచాయ్ పక్క పక్కనే కూర్చొని మ్యాచ్ చూస్తూ కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఫోటోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా ఈ పోటోలను సచిన్ టెండూల్కర్ తన ట్విటర్‌లో పోస్టు చేసాడు. 'క్యా యేహ్ సుందర్ పిక్ హై' అని రాసుకొచ్చారు. ఈ ఫొటోలకు క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో లైకులు కొట్టడంతో పాటు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా ట్వీట్‌కు సుందర్ పిచాయ్ సమాధానం ఇచ్చారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. మహీ భాయి అయితే.. 'బహోత్ బడియా' (చాలా అద్భుతంగా ఉంది) అని పేర్కొనేవాడు అంటూ సమాధానం ఇచ్చారు. సచిన్‌తో కలిసి మ్యాచ్ చూడటం సంతోషంగా ఉంది. మరో ప్రపంచకప్ వరకు ఈ జ్ఞాపకాలను పదిలంగా దాచుకుంటా పిచాయ్ పేర్కొన్నారు. చిన్నతనంలో క్రికెటర్ కావాలని కలలు కనేవాడినని.. సునీల్ గవాస్కర్, సచిన్‌ను ఆరాధించేవాడినని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే వైరల్ అయిన ఈ ట్వీట్.. సుందర్ పిచాయ్ కూడా స్పందించడంతో మరింత వైరల్ అయ్యింది. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం కూడా కివీస్ జట్టుపై గెలిచి ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరుకుంది.