
ప్రపంచకప్‌లో అపజయమే లేకుండా దూసుకెళుతున్న భారత్ తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంకు చేరుకుంది. వన్డేల్లో భారత్ 123 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచకప్ ఆరంభం వరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్.. శ్రీలంక, ఆస్ట్రేలియా చేతిలో ఓడడంతో రెండు రేటింగ్ పాయింట్లు కోల్పోయింది. దీంతో 122 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. వరుస విజయాలతో భారత్ ఒక రేటింగ్ మెరుగుపరుచుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
న్యూజిలాండ్ (116) మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (112), దక్షిణాఫ్రికా (109) నాలుగు, ఇదో ర్యాంకులో నిలిచాయి. టెస్టుల్లోనూ భారత్ (113) నంబర్‌వన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక టీ 20లలో మాత్రం ఐదవ స్థానంలో (260) కొనసాగుతోంది. టెస్టుల్లో నం.1 బ్యాట్స్‌మన్‌గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (922) ఉన్నాడు. బౌలర్ల జాబితాలో పాట్ కమిన్స్ అగ్రస్థానంలో నిలిచాడు. వన్డేల్లో కోహ్లీనే టాప్ బ్యాట్స్‌మన్ కాగా.. బౌలర్ల జాబితాలో బుమ్రా నం.1గా ఉన్నాడు. ఆల్‌రౌండర్‌ల జాబితాలో షకీబ్ మొదటి స్థానంలో ఉన్నాడు.
ప్రపంచకప్‌లో ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచి సెమీస్ దిశగా అడుగులేస్తున్న భారత్ గురువారం వెస్టిండీస్‌ను ఢీకొనబోతోంది. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియాలపై సాధించిన విజయాలు భారత్ ఆధిపత్యాన్ని చూపాయి. అయితే అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ఒక్కసారిగా జట్టులో కొత్త లోపాలను చూపించింది. వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లే క్రమంలో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీలో ఇప్పటి వరకు ఒకే మ్యాచ్ గెలిచింది విండీస్. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిస్తే తప్ప సెమీస్ ఆశలు పెట్టుకోలేని స్థితిలో విండీస్ ఉండగా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్‌కు దాదాపుగా చేరువవుతుంది.