
పాకిస్తాన్ విధ్వంసక ఆటగాడు, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిలా బ్యాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అని అఫ్ఘానిస్తాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలిపారు. రషీద్ ఖాన్ బంతితోనే కాదు బ్యాట్‌తో కూడా రాణించగలడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా బంతులను స్టాండ్స్ లోకి కూడా పంపిస్తాడు. బ్యాట్‌తో కూడా మాయచేసే రషీద్ తనకు నచ్చిన బ్యాట్స్‌మన్ ఎవరో చెప్పేసాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ మాట్లాడుతూ... 'ప్రపంచ క్రికెట్‌లో తాను ఎక్కువ అభిమానించేది అఫ్రిదినే. అతని బౌలింగ్ శైలే కాదు బ్యాటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అతని లాంటి ఆటగాళ్లు చాలా అరుదు. అఫ్రిది రికార్డును ఓసారి చెక్ చేసుకుంటే ఇదే తెలుస్తుంది. అఫ్రిది ఖాతాలో ఎక్కువ సెంచరీలు లేకపోవచ్చు కానీ అతను బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి వస్తే ఫోర్లు, సిక్సర్లలతో అభిమానుల్ని అలరించేవాడు' అని రషీద్ పేర్కొన్నారు.
'అఫ్రిది క్రీజ్‌లో ఎక్కువ సేపు లేకపోయినా వినోదాన్ని పంచడంలో మాత్రం ముందుండేవాడు. అందుకే అఫ్రిదికి అభిమానిని అయ్యా. అఫ్రిదిలా బ్యాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో అతన్ని తొలిసారి కలిశా. ఆ సమయంలో చాలా ఆనందం వేసింది. అయితే ప్రత్యేకించి క్రికెట్ లేదా బౌలింగ్ గురించి ఏమీ మాట్లాడుకోలేదు' అని రషీద్ ఖాన్ తెలిపారు.
మొదటగా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన రషీద్.. అనంతరం స్పిన్నర్‌గా రూపాంతరం చెందాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రషీద్ ఇప్పటికే నిరూపించుకుని దిగ్గజాల ప్రశంసలు సైతం అందుకుంటున్నాడు. ఇక ఐపీఎల్-12లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లకు సైతం చుక్కలు చూపించాడు. త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో తన ప్రభావం చూపెడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.