
మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీమిండియాకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. టెస్టుల్లో, వన్డేల్లో టీమిండియాను నెంబర్ వన్ స్థానంలో నిలిపాడు. ఛాంపియన్ ట్రోఫీ కూడా సాధించి పెట్టాడు. ఇక రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీ.. గత కొంతకాలంగా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్-2019 అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల ఆటగాళ్లు సైతం ఇంకా రెండేళ్లు ఆడొచ్చు ధోనీ, ఇప్పుడే రిటైర్మెంట్ వద్దు అని అంటున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ ప్రపంచకప్‌లో ధోనీ బాగానే ఆడాడు. సహచరులు పెవిలియన్ చేరుతున్నా.. క్రీజులో పాతుకుపోయి వికెట్లను అడ్డుకున్నాడు. అయితే ఆఫ్ఘానిస్తాన్, ఇంగ్లాండ్ మ్యాచ్‌ల స్ట్రైక్ రేట్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మ్యాచుతో ధోనీ ధాటిగా బ్యాటింగ్ చేయకపోవడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇక కీలక సెమీస్ మ్యాచ్‌లో ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మంచి ఇన్నింగ్స్ ఆడడంతో ధోనీ ఆటకు అందరూ ఫిదా అయ్యారు.
భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఈ దశలో ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మొదటి బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన ధోనీ.. రెండో పరుగుకు యత్నించగా కివీస్ ఫీల్డర్ మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రో బెయిల్స్‌కు తాకడంతో ధోనీ పెవిలియన్ చేరాడు. ఈ డైరెక్ట్ త్రోనే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
భారత్ ఓడిపోయినా.. ధోనీ మాత్రం అభిమానుల మనుసు గెలుచుకున్నాడు. ధోనీని మాజీలు, ప్రముఖులు, అభిమానులు తన ట్విట్టర్ ఖాతాలలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీంతో ధోనీ ఇన్ బిలియన్ హార్ట్స్ అనే హాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాష్ టాగ్ కనపడుతోంది. మరి ధోనీ ఆ మజాకా!!.