
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ధోనీ అభిమానులు ఒకరిపై మరొకరు సోషల్‌మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో శనివారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సచిన్ టెండుల్కర్ విమర్శలు చేయడానికి ఆస్కారం ఇచ్చింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో ధోనీ.. తన శైలికి భిన్నంగా చాలా మందకొడిగా ఆడాడు. 52 బంతుల్లో 28 పరుగులు చేశాడు. భారీ షాట్‌ను ఆడటానికి ప్రయత్నించి, స్టంప్ అవుట్ అయ్యాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్‌తో కలిసి ధోనీ.. విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ.. అతని ఇన్నింగ్ చాలా మందకొడిగా సాగిందని సచిన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీంతో ధోనీ అభిమానులు సచిన్‌పై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. టీమిండియాకు మూడు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌పై సచిన్ విమర్శలు చేయడం మంచిది కాదని వాళ్లు ట్రోల్ చేశారు. సచిన్ కానీ.. మరే కెప్టెన్ కూడా సాధించలేని ప్రపంచకప్‌ను ధోనీ మాత్రమే సాధించాడని.. ఆ విషయం గుర్తుపెట్టుకొని సచిన్ మాట్లాడాలని ధోని అభిమానులు ట్వీట్లు చేశారు.
దీంతో ఈ ట్వీట్లకు సచిన్ అభిమానులు కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నారు. సింహాన్ని చూసి కుక్కలు మొరుగుతున్నాయని.. వాటిని పట్టించుకోవద్దని సచిన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. "సచిన్‌ని ప్రశ్నిస్తున్న వెధవల వయస్సు సచిన్ కెరీర్ కంటే చిన్నది. వాళ్లు ఐపీఎల్ మాత్రమే క్రికెట్ అనుకుంటున్నారు. వాళ్ల ట్వీట్లకు స్పందించండి. వాళ్లని అలాగే మొరగనివ్వండి" అని ధోనీ, కోహ్లీలు సచిన్‌ని తమ భుజాలపై మోస్తున్న ఫొటో ఓ సచిన్ అభిమాని ట్వీట్ చేశాడు.