
విశ్రాంతి తీసుకునే ఉద్దేశం లేదు, అన్ని మ్యాచ్‌లు ఆడాలని అనుకుంటున్నట్లు యార్కర్ల కింగ్, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో బుమ్రా 4 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో వరుస బంతుల్లో ఇద్దరు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఔరా అనిపించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇప్పటికే భారత్ 13 పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇంకా శ్రీలంకతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ నామమాత్రమే కావడంతో.. బుమ్రాకు విశ్రాంతినిస్తారనే ప్రచారం జరిగింది. ఈ నెల 9 నుండి సెమీస్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ఎటువంటి గాయాలు కాకుండా ఉండడానికి జట్టు యాజమాన్యం బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చే ఆలోచనలో ఉందట. మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో బుమ్రాను అడిగారు.
బుమ్రా మాట్లాడుతూ... 'ఇది నా తొలి ప్రపంచకప్. చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంకా మ్యాచ్‌లు ఆడాలని ఉంది. నేనొక అనుభవం కలిగిన బౌలర్ అనుకోవడంలేదు. కొన్ని మ్యాచ్‌లు ఆడనని చెప్పడం లేదు. ఎప్ప్పుడూ ఆడటానికే ఇష్టపడుతా. ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే ఎక్కువ సంతోషంగా ఉంటుంది' అని బుమ్రా తెలిపాడు.
'నెట్ ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తా. మైదానంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని అంచనా వేస్తూ దానికనుగుణంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తా. కొత్త బంతి, పాత బంతి, డెత్ ఓవర్లలో ఎలా వేయాలో సాధన చేస్తా. బ్యాటింగ్ చేసేది ఎవరనేది పట్టించుకోను. కేవలం జట్టు విజయానికి ఏం చేయాలనేదానిపైనే దృష్టిపెడతా' అని బుమ్రా పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. రోహిత్ శర్మ (104) రికార్డు సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (77) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బుమ్రా 4, హార్దిక్ 3 వికెట్లు తీశారు. సెంచరీ చేసిన రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.