
ఆస్ట్రేలియా యువ టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ ఆష్లీ బార్టీ ప్రపంచకప్-2019లో సందడి చేసింది. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన బార్టీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్, కోచ్ జస్టిన్ లాంగర్ ఆహ్వానించడంతో బార్టీ లార్డ్స్ మైదానంకు వచ్చింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మ్యాచ్ జరుగుతున్నంతసేపూ స్టేడియంలో సందడి చేసింది. ఇక మ్యాచ్ ముగిశాక ఆసీస్ డ్రెస్సింగ్ గదిలో ఆటగాళ్లతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించింది. టెన్నిస్ కెరీర్ నుంచి మధ్యలో రెండేళ్ల విరామం తీసుకున్న బార్టీ.. క్రికెటర్‌గా మారి మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన సంగతి తెలిసిందే. బార్టీకి ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పెద్ద ఫ్యాన్. అందుకే మ్యాచ్ చూడడానికి ఆహ్వానం పంపాడు. మ్యాచ్ అనంతరం బార్టీతో కలిసి ఫించ్ ఫొటో కూడా దిగాడు. ఈ ఫొటోకు ఫించ్ భార్య ఓ సరదా కామెంట్ కూడా చేసింది.
తాజాగా ఆష్లీ బార్టీ ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకుంది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ పోరులో చెక్ క్రీడాకారిణి మార్కెటా వొంద్రుసోవాను మట్టికరిపించింది. 70 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 6-1, 6-3 తేడాతో వొంద్రుసోవాపై జయకేతనం ఎగురవేసింది. 1973 తర్వాత గ్రాండ్‌స్లామ్ నెగ్గిన ఆస్ట్రేలియన్‌గా ఆష్లీ బార్టీ రికార్డు సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ ఆష్లీ బార్టీకి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్.