ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఘనంగా నిర్వహించాలని, తమ గడ్డపై టీమిండియా తిరిగి అడుగుపెట్టించాలని పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పాక్‌కు వెళ్లే విషయమై భారత్ స్పష్టత ఇవ్వనప్పటికీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్య ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది.
అయితే ఈ నేపథ్యంలో తమ దేశంలో స్టేడియాల పరిస్థితిని చూసిన పీసీబీ చీఫ్ మోసిన్ నక్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. స్టేడియాల్లో తగినన్ని సీట్లు, బాత్రూమ్‌లు కూడా లేకపోవడంపై మండిపడ్డాడు. అరకిలోమీటరు దూరం నుంచి ఆటను చూసేలా వేదికలు ఉన్నాయని అన్నాడు. మౌళిక సదుపాయాలపై దృష్టిసారించాలని అధికారులకు ఆదేశించాడు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఆతిథ్య పనులను పీసీబీ ప్రారంభించింది. మౌలిక వసతుల కోసం ఇప్పటికే 17 బిలియన్ల పాకిస్థాన్ రూపాయలను కేటాయించింది.కానీ పనులలో జాప్యం జరగడంతో నక్వీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్టేడియాల ప్రమాణాలతో పోలిస్తే తమ స్టేడియాలు దారుణంగా ఉన్నాయని అన్నాడు.
''అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మన స్టేడియాలకు భారీ వ్యత్యాసం ఉంది. అసలు ఈ వేదికలను అంతర్జాతీయ స్టేడియాలు అంటారా? ఒక్కటి కూడా ప్రమాణాలకు తగ్గట్లుగా లేదు. తగిన సీట్లు, బాత్రూమ్‌లు లేవు. ఇక 500 మీటర్ల నుంచి దూరంగా వీక్షిస్తున్నట్లుగా ఉంది'' అని మోసిన్ నక్వీ పేర్కొన్నాడు.
అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే అన్ని చక్కబడతాయని నక్వీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ పనుల కోసం ఫ్రంటీర్ వర్క్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది శ్రమిసస్తోందని, స్టేడియాలను అత్యుత్తమంగా మారుస్తామని తెలిపాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ డిమాండ్ చేస్తుంది. పాక్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టదని స్పష్టం చేసింది.