For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఊహించని షాక్: బౌలర్లు విఫలం, శ్రీలంక చేతిలో భారత్ ఓటమి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది

By Nageshwara Rao

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కి రెండో మ్యాచ్‌లో ఊహించని షాక్ తగిలింది. ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ చెలరేగినా.. బౌలర్లు తేలిపోవడంతో శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది.

322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. శ్రీలంక ఓపెనర్ గుణతిలక (76; 72 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు), కుశాల్ మెండిస్ (89; 93 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

చివర్లో పెరెరా (47; 44 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ మాథ్యూస్ (52 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు), గుణరత్నే (34 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు)తో రాణించి గెలుపు లాంఛనాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే 322/3తో పూర్తి చేశారు. ఈ ఓటమితో సెమీఫైనల్ అవకాశాల్ని భారత్ సంక్లిష్టం చేసుకుంది.

టోర్నీలో నిలవాలంటే దక్షిణాఫ్రికాతో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతకముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ 78, శిఖర్ ధావన్ 125 పరుగులతో రాణించగా చివర్లో ధోనీ(63) బ్యాట్ ఝుళిపించాడు. శ్రీలంక బౌలర్లలో మలింగ రెండు, లక్మల్, నువాన్ ప్రదీప్, గుణరత్నే, పెరారా తలో వికెట్ తీశారు.

అర్ధ సెంచరీ చేసిన ధోని
లంకతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అర్ధ సెంచరీతో రాణించాడు. 46 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్సర్‌ సాయంతో ధోని అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో 48 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు నష్టానికి 297 పరుగులు చేసింది. ప్రస్తుతం ధోని 56, కేదార్ జాదవ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

MSD

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. లక్మల్ బౌలింగ్‌లో 46వ ఓవర్ నాలుగో బంతికి హార్దిక్ పాండ్యా భారీ షాట్‌కు ప్రయత్నించి కుశాల్ పెరారా చేతికి చిక్కాడు. పాండ్యా అవుటైన తర్వాత కేదార్ జాదవ్ క్రీజులోకి వచ్చాడు. 46 ఓవర్లకు గాను టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. ధోని 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

లంకతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ 125 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మలింగ్ బౌలింగ్‌లో మెండిస్‌కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా జట్టు స్కోరు 261 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ధావన్-ధోనిలు నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 45 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 270 పరుగులు చేసింది. ధావన్ అవుటైన తర్వాత ఆల్ రౌండర్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ధోని 45, పాండ్యా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బౌండరీతో ధావన్ సెంచరీ
లంకతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ సెంచ‌రీ చేశాడు. 112 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో ధావన్ సెంచరీ సాధించాడు. వ‌న్డేల్లో ధావన్‌కి ఇది ప‌దో సెంచ‌రీ. శ్రీలంక జట్టు అంటేనే రెచ్చిపోయి ఆడే ధావన్ ఈ మ్యాచ్‌లో ఫోర్లతో చెలరేగాడు. శ్రీలంక‌తో ఆడిన చివ‌రి ఐదు మ్యాచుల్లో ధావ‌న్‌కిది రెండో సెంచ‌రీ. మిగ‌తా మూడు మ్యాచుల్లోనూ అర్ధ సెంచ‌రీలు సాధించాడు.

Dhawan

యువీ అవుట్: మూడో వికెట్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. గుణరత్నే బౌలింగ్‌లో 33వ ఓవర్ మూడో బంతికి 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ సింగ్ బౌల్డయ్యాడు. యువీ అవుటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. 34 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 179 పరుగులు చేసింది. ప్రస్తుతం ధావన్ 85, ధోని పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

కోహ్లీ డకౌట్: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను నిరాశపరిచాడు. ప్రదీప్ బౌలింగ్‌లో కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు.

తొలి వికెట్ కోల్పోయిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మలింగ బౌలింగ్‌లో 25వ ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో క్రీజులో అర్ధ సెంచరీ చేసిన శిఖర్ ధావన్‌(51)కు కెప్టెన్ కోహ్లీ జత కలిశాడు. 25 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్, ధావన్‌లు తొలి వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ సాధించాడు. 69 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 124 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ 71, శిఖర్ ధావన్ 45 పరుగులతో క్రీజులో ఉన్నారు.

100 పరుగుల దాటిన జట్టు స్కోరు

భారత ఓపెన‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లోనూ సెంచ‌రీ భాగస్వామ్యాన్ని న‌మోదు చేశారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి వికెట్‌కు 136 ప‌రుగులు జోడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో మొద‌ట నుంచి ఆచితూచి ఆడుతూ రోహిత్‌శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌.. త‌ర్వాత లంక బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో రోహిత్‌శ‌ర్మ అర్ధ సెంచ‌రీ చేయ‌గా.. ధావ‌న్ చేరువ‌లో ఉన్నాడు.

Rohit sharma

సిక్స్‌తో అర్ధసెంచరీ చేసిన రోహిత్ శర్మ

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఓపెనర్లు సత్తా చాటడంతో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ సిక్స్‌తో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 62 బంతుల్లో 58 పరుగులతో రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేశాడు. 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ 58, ధావన్ 42 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆచితూచి ఆడుతున్న టీమిండియా
లంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నెమ్మదిగా ఆడుతోంది. శిఖర్‌ ధావన్‌ (28) దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (20) నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడుల్లా చెత్త బంతులను బౌండరీలుగా తరలిస్తున్నాడు. పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 48 పరుగులు చేసింది.

Sri Lanka elect to bowl against India

బౌండరీతో ఇన్నింగ్స్ మొదలు
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌండరీతో పరుగుల ఖాతా తెరిచింది. లసిత్‌ మలింగ వేసిన తొలి బంతిని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కవర్‌ పాయింట్‌ దిశగా బౌండరీగా తరలించాడు. ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 6, శిఖర్‌ ధావన్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు

టాస్ గెలిచిన శ్రీలంక: కోహ్లీసేన బ్యాటింగ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుని కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై కూడా మరోసారి అలాంటి ప్రదర్శనే కనబర్చి సెమీస్‌కు అర్హత సాధించాలని భావిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిమ్యాచ్‌లో ఘోరపరాజయం పాలైన లంకకు ఈ మ్యాచ్‌ చావోరేవోలాగా మారింది.

ICC Champions Trophy: Match 8: Sri Lanka elect to bowl against India

సెమీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో లంక కచ్చితంగా నెగ్గాలనే ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. 2007-14 మధ్యకాలంలో ఐదు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఆడిన శ్రీలంక ఇప్పుడు ఆ స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

మరో వైపు ఈ మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షం ధాటికి రద్ద అయిన సంగతి తెలిసిందే. గురువారం జరిగే ఈ మ్యాచ్‌కు కూడా వాన ముప్పు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు దిగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టులో కీలక మార్పు చేసింది.

ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడిన కపుగెదెర స్థానంలో దనుష్క గుణతిలకను జట్టులోకి తీసుకుంది. గాయం కారణంగా కపుగెదెర మొత్తం టోర్నీకే దూరమైనట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రతినిధులు వెల్లడించారు. భారత్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా కపుగెదెర గాయపడ్డాడు.

కుడి కాలికి గాయమవ్వడంతో ఫిజియోల సలహా మేరకు అతనికి స్కానింగ్‌ తీయించగా గాయం తీవ్రమైందిగా తేలింది. వైద్యులు రెండు వారాలు విశ్రాంతి సూచించారు. దీంతో కపుగెదెర టోర్నీ మొత్తానికి దూరమైనట్లు బోర్డు నిర్వాహకులు తెలిపారు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అతని స్థానంలో దనుష్కను జట్టులోకి తీసుకుంది.

జట్ల వివరాలు:

టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, కేదార్‌ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, బుమ్రా

శ్రీలంక: డిక్‌వెల్లా, చండిమల్, కపుగెడెరా, మెండిస్, పెరీరా, గుణరత్నే, మాథ్యూస్, ప్రసన్న, ప్రదీప్, లక్మల్, మలింగా.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+