
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త చైర్మన్ నామినేషన్ ప్రక్రియపై గురువారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఐసీసీ సభ్య దేశాలతో ఈరోజు జరుగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో నామినేషన్‌పై ఓ నిర్ణయానికి రానున్నారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌పై వచ్చే నెలలో నిర్ణయం ప్రకటిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఐసీసీ.. ఎన్నికల అంశంపై ప్రధానంగా చర్చించనుంది.
అయితే ఎలక్షన్ తేదీని ప్రకటించే అవకాశాలు దాదాపుగా లేవని ఐసీసీ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. 'ఐసీసీ చైర్మన్ పదవికి జరిగే ఎన్నిక తేదీని గురువారం ప్రకటిస్తారో లేదో తెలియదు. కానీ శశాంక్ మనోహర్ వారసుడి ఎంపిక ప్రక్రియే భేటీలో ప్రధాన అజెండా. నామినేషన్ల విధివిధానాలపై చర్చ జరగొచ్చు' అని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది.
ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియగా.. ఎక్స్‌టెన్షన్‌కు ఆయన అంగీకరించకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. మొన్నటి వరకు ఇంగ్లండ్‌కు చెందిన కొలిన్ గ్రోవర్ చైర్మన్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు కనిపించినా.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఎహ్‌సాన్ మనీ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
ఈ ముగ్గురిలో ఈసీబీ మాజీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్.. చైర్మన్ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. సౌరవ్ గంగూలీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తే.. ఐసీసీ ఛైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారుతుంది. అయితే గంగూలీ సొంత రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఈ ఐసీసీ పదవిపై అతను ఆసక్తి చూపకపోవచ్చని సమాచారం.