
జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడడమే కాకుండా ఆ విషయాన్ని ఆలస్యంగా చెప్పినందుకు మూడున్నరేళ్లు నిషేధించింది. ఈ మూడున్నరేళ్లే కాకుండా డ్రగ్స్ తీసుకునందుకు మరో నెల రోజులు నిషేధం విధించింది. 35 ఏళ్ల టేలర్ ఐసీసీలోని అవినీతి నిరోధక విభాగంలోని నాలుగు రూల్స్‌తోపాటు, యాంటీ డోపింగ్ కోడ్ కింద ఒక రూల్‌ను ఉల్లఘించినట్లు ఒప్పుకున్నాడని అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలిలోని ఆర్టికల్ 2.4.2, 2.4.3, 2.4.4, 2.4.7 నిబంధనలను టేలర్ అతిక్రమించాడని ఐసీసీ పేర్కొంది. దీనికి తోడు డ్రగ్స్ తీసుకోని డోపింగ్ నిబంధనలను కూడా అతిక్రమించాడు. దీంతో నిషేధం కారణంగా 2025 జూలై 28 వరకు టేలర్ క్రికెట్‌కు దూరం కానున్నాడు. అయితే బ్రెండన్ టేలర్ గత ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
కాగా భారత్‌కు చెందిన ఓ వ్యాపారితో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తాను డబ్బు తీసుకున్నానని ఈ నెల 24న టేలర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆ రోజే తాను తప్పు చేసినట్లు టేలర్ ఒప్పుకోవడమే కాకుండా తనపై ఐసీసీ కచ్చితంగా నిషేధం విధిస్తుందని అంచనా వేశాడు. అసలు ఏం జరిగిందంటే ఈ నెల 24న తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డంటూ టేలర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఒక ప్రకటనను విడుదల చేశాడు. ఆ ప్రకటన ప్రకారం 2019 అక్టోబర్‌లో ఓ వ్యాపారి పిలుపు మేరకు జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ భారత్ వచ్చాడు. ఆ సందర్భంగా సదరు వ్యాపారి ఓ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో సదరు వ్యాపారి కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను టేలర్‌కు ఇచ్చాడు. దీంతో టేలర్ వాటిని తీసుకున్నాడు. మరుసటి రోజు టేలర్ ఉండే హోటల్ గదికి ఆరుగురు వ్యక్తులు వచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాలని అందుకుగాను భారీగా డబ్బులు ఇస్తామని అతనికి ఆఫర్ చేశారు.
టేలర్ ససేమిరా అనడంతో అతను నైట్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టేలర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు అంగీకరించాడు. బుకీలు ఇచ్చిన 15 వేల డాలర్లను తీసుకున్నాడు. పని పూర్తయ్యాక మరో 20 వేల డాలర్లు ఇస్తామని బుకీలు టేలర్‌కు చెప్పారు. దీంతో ఆ డబ్బును తీసుకుని టేలర్ తన స్వదేశమైన జింబాబ్వే వెళ్లిపోయాడు. అయితే అతని కుటుంబం భద్రతా దృష్యా టేలర్ అప్పుడే ఈ విషయాన్ని బయటపెట్టలేకపోయాడు. ఇటీవల స్వయంగా తానే తప్పును ఒప్పుకుంటూ ఐసీసీకి విషయాన్ని చెప్పాడు.