హైదరాబాద్: 2016 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం వార్షిక అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు టాప్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.

అందులో ఒకటి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కాగా, రెండోది టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తర్వాత ఒకే ఏడాదిలో రెండు అవార్డులను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు.
2004లో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇలా రెండు అవార్డులను జాక్వస్ కల్లిస్ (2005), రికీ పాంటింగ్ (2006), కుమార సంగక్కర (2012), మైఖెల్ క్లార్క్ (2013), మిచెల్ జాన్సన్ (2014), స్టీవ్ స్మిత్ (2015)లు అవార్డులను అందుకున్నారు.