హైదరాబాద్: టెస్టు ఫార్మాట్‌కు కొత్త రూపు తేవాలని యోచిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆ మేరకు కార్యాచరణ రూపొందించే దిశగా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పరమిత ఓవర్ల క్రికెట్‌లో నిర్వహిస్తున్న ఛాంపియన్‌షిప్ టోర్నీలను టెస్టుల్లో కూడా తీసుకురావాలని చూస్తోంది.
అభిమానులను టీ20లు విపరీతంగా అలరిస్తున్న వేళ ఐదు రోజులు మ్యాచ్‌లకు ఆదరణ లభించాలంటే టెస్టు ఛాంపియన్‌షిప్ తప్పనిసరని ఐసీసీ చాన్నాళ్లుగా వాదిస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా ఐదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్‌లకు ఊతమివ్వాలని స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ యోచిస్తోంది.

ఇందులో భాగంగా టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించేందుకు ఐసీసీ ఆమోద వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'టెస్టు చాంపియన్' టోర్నీకి ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. టీ20 ఫార్మెట్ వచ్చిన తర్వాత టెస్టు క్రికెట్‌పై అభిమానులు పెద్దగా ఆసక్తిని కనబర్చడం లేదు.
దీంతో టెస్టు క్రికెట్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకు రావడం కోసం టెస్టు ఛాంపియన్ షిప్‌ను నిర్వహించాలని ఐసీసీ చూస్తోంది. ఈ ఛాంపియన్ షిప్‌లో టెస్టు హోదా కలిగిన తొమ్మిది దేశాలు పాల్గొంటాయని పేర్కొంది. ఆక్లాండ్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలోనే టెస్టుల్లో కొత్త విధానానికి ఐసీసీ శ్రీకారం చుట్టినట్లు హెరాల్డ్ స్పష్టం చేసింది.
2019లో తొలి టెస్టు ఛాంపియన్ షిప్‌ను రూపొందించేలా ఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రెండేళ్ల కొకసారి ఈ ఛాంపియన్ షిప్‌ను నిర్వహించి ఫైనల్ మ్యాచ్‌ని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించాలనే యోచనలో ఐసీసీ ఉంది. దీంతో ద్వైపాక్షిక సిరీస్‌ల కన్నా ఈ పోటీలు మరింత ఆసక్తికరంగా ఉంటాయని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సందర్లాండ్ అన్నారు.
అంతర్జాతీయ వన్డేల్లోనూ ఇలాంటి మార్పులే రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల సైకిల్ ప్రకారం 13 దేశాల వన్డే లీగ్ గురించి సమాలోచనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల స్థానంలో మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్నట్లు ఆయన తెలిపారు.