ఐసీసీ కీలక నిర్ణయం.. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్!!

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్ సెమీస్, పైనల్లో సూపర్ ఓవర్ కూడా టై అయితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించకుండా.. ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్‌లు ఆడిస్తామని స్పష్టం చేసింది. సోమవారం జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో ఐసీసీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు సూపర్ ఓవర్ టై అయితే బౌండరీల లెక్కను బట్టి విజేతను నిర్ణయించేవారు.

పెద్దఎత్తున విమర్శలు:
ఇటీవల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టై కావడంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. కానీ సూపర్ ఓవర్ కూడా టైగా మారడంతో.. బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఐసీసీ నిబంధనలపై క్రికెటర్లు, మాజీలు, అభిమానులు పెద్దఎత్తున విమర్శించారు.

ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్:
ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్‌ను నిర్వహించాలని మాజీ క్రికెటర్లు చాలా మంది సూచించారు. దీంతో అనిల్ కుంబ్లే నేతృత్వంలో సూపర్ ఓవర్ నిబంధనలపై ఐసీసీ ఓ కమిటీని నియమించింది. కుంబ్లే కమిటీ సిఫార్సుల మేరకు ఐసీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ టై అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లు ఉంటాయి. కేవలం నాకౌట్ దశలోనే ఆడించే సూపర్ ఓవర్‌లను ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. అయితే ఆ సూపర్ ఓవర్ టై అయితే మ్యాచ్‌ను టైగా పరిగణిస్తారు. మరో సూపర్ ఓవర్ ఉండదు.

నిషేధం ఎత్తివేత:
జింబాబ్వే, నేపాల్ క్రికెట్ బోర్డులపై విధించిన నిషేధాన్నిఐసీసీ ఎత్తేసింది. మళ్లీ ఆ దేశాలను సభ్యులుగా గుర్తిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. జింబాబ్వే బోర్డు అధికారులు, క్రీడా మంత్రులతో చర్చించాక ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం చేసుకుంటున్నదన్న కారణంతో జింబాబ్వేపై ఐసీసీ ఈ ఏడాది జులైలో నిషేధం విధించగా.. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు ఎన్నికల్లో అక్కడి ప్రభుత్వం కలుగజేసుకుందని నేపాల్‌ను 2016లోనే ఐసీసీ బ్యాన్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications