టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్‌గా భారత్ అవతరించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి జగజ్జేతగా నిలిచింది. అయితే ఈ మహా సమరంలో సత్తాచాటిన అత్యుత్తమ ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఈ టీమ్‌లో విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లదే హవా. టీమిండియా నుంచి ఆరుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. సంచలన ప్రదర్శనలతో సెమీఫైనల్స్‌కు దూసుకొచ్చిన అఫ్గానిస్థాన్ నుంచి ముగ్గురు ప్లేయర్లు సెలక్ట్ అయ్యారు.
రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా నుంచి ఒక్క ఆటగాడు కూడా ఐసీసీ జట్టులో చోటు దక్కలేదు. అయితే 12వ ఆటగాడిగా మాత్రం సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియాను ఐసీసీ తీసుకుంది. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యారు. ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లికి ఛాన్స్ దక్కలేదు.

ఈ ప్రపంచకప్‌లో రోహిత్ ఓపెనర్, కెప్టెన్‌గా అదరగొట్టాడు. 36 సగటు, 156 స్ట్రైక్‌రేటుతో 257 పరుగులు చేశాడు. రోహిత్‌తో పాటు మరో ఓపెనర్‌గా అఫ్గాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎంపిక అయ్యాడు. అతను 281 పరుగులు చేశాడు. అలాగే నికోలస్ పూరన్ (228 పరుగులు), సూర్య (199 పరుగులు) బ్యాటర్లుగా ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఆల్‌రౌండర్లుగా స్టొయినిస్ (169 పరుగులు, 10 వికెట్లు), హార్దిక్ పాండ్య (144 పరుగులు, 11 వికెట్లు), అక్షర్ పటేల్ (92 పరుగులు, 9 వికెట్లు) జట్టులో చేరారు. ఇక బౌలర్లుగా రషీద్ ఖాన్ (14 వికెట్లు), బుమ్రా (15 వికెట్లు), అర్ష్‌దీప్ సింగ్ (17 వికెట్లు), ఫరూఖీ (17 వికెట్లు) సెలక్ట్ అయ్యారు. 12వ ఆటగాడిగా నోకియా (15 వికెట్లు) ఎంపికయ్యాడు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జట్టు:
రోహిత్ శర్మ (భారత్), రహ్మనుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్), నికోలస్ పూరన్ (వెస్టిండీస్), సూర్యకుమార్ యాదవ్ (భారత్), మార్కస్ స్టొయినిస్ (ఆస్ట్రేలియా), హార్దిక్ పాండ్య (భారత్), అక్షర్ పటేల్ (భారత్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్), జస్‌ప్రీత్ బుమ్రా (భారత్), అర్షదీప్ సింగ్ (భారత్), ఫజల్లా ఫరూకీ (అఫ్గానిస్థాన్)
12వ ప్లేయర్- అన్రిచ్ నోకియా (దక్షిణాఫ్రికా).