
సిడ్నీ: ప్రపంచ క్రికెట్‌లో ఎల్బీడబ్యూ విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనను మార్చాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. పిచ్‌పై బంతి ఎక్కడ పడినా.. లైన్‌లో లేకపోయినా.. స్టంప్స్‌ను తాకుతుందని అంపైర్ భావిస్తే ఎల్బీగా ఔటివ్వాలని ఛాపెల్ ఐసీసీకి సూచించాడు. ఎల్బీ నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డాడు.
'కొత్త ఎల్బీ నిబంధన సూటిగా ఉండాలి. పిచ్‌పై బంతి ఎక్కడ పడినా.. ఆఫ్‌స్టంప్ ఆవల ప్యాడ్‌ను తాకినా.. లైన్‌లో లేకపోయినా.. స్టంప్స్ తాకుతుందని అంపైర్‌కు అనిపిస్తే ఎల్బీగా ఔటివ్వా లి. దీని వల్ల ఆటలో న్యాయం జరుగుతుంది. బౌలర్ స్టంప్స్‌పైకి బంతులు సంధిస్తుంటే బ్యాట్స్‌మన్ తన వికెట్ కాపాడుకోడానికి బ్యాటునే ఉపయోగించాలి. గాయాలు కాకుండా ఉండేందుకే ప్యాడ్లు. ఔట్ కాకుండా కాదు' అని ఛాపెల్ తెలిపాడు.
ప్రస్తుత రూల్ ప్రకారం... ఏ బంతైనా లైన్‌కు అవతల పిచ్ అయి బ్యాట్స్‌మన్ బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తాకినా ఎల్బీగా పరిగణించరు. ప్రధానంగా బంతి ఆఫ్ స్టంప్‌పై కానీ, లెగ్ స్టంప్‌పై కానీ పడి ప్యాడ్‌కు తగిలి వికెట్ల మీదకు వెళుతున్నా అది ఔట్ కాదు. కచ్చితంగా లైన్‌లో మాత్రమే పడి బ్యాట్‌మన్ బంతిని టచ్ చేయలేని క‍్రమంలో ప్యాడ్‌కు తగిలి వికెట్ల మీదుకు వెళుతున్నప్పుడు ఎల్బీగా ఇస్తారు. దీని వల్ల ఎక్కువగా స్పిన్నర్లు నష్టపోతూ ఉంటారు.
అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలపై బ్యాట్స్‌మెన్ లేదా ప్రత్యర్థి జట్టు కెప్టెన్ సవాల్ చేసే వెసులబాటుని డీఆర్‌ఎస్ రూపంలో ఐసీసీ కల్పించింది. అయితే కొన్ని సందర్భాల్లో అంపైర్స్ కాల్‌గా వస్తుంటాయి. రివ్యూ అడగకముందు అంపైర్ ఏ నిర్ణయం ప్రకటించాడో దానికే మూడో అంపైర్ కట్టుబడతాడు.
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా-భారత్‌ల టెస్టు సిరీస్ గురించి ఇటీవల మాట్లాడిన చాపెల్... ఈసారి టీమిండియా సిరీస్‌ను సాధించడం చాలా కష్టమన్నాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండవచ్చు కానీ.. రాబోవు సిరీస్‌లో మాత్రం ఆసీస్ అంత తేలిగ్గా లొంగదన్నాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లను తొందరగా పెవిలియన్‌కు పంపిస్తేనే టీమిండియా గెలిచే అవకాశముందున్నాడు.