స్మిత్, విలియమ్సన్, రూట్ కాదు.. కోహ్లీనే కింగ్: మాజీ దిగ్గజం

సిడ్నీ: ఆధునిక క్రికెట్‌లో బ్యాటింగ్, ఫిట్‌నెస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఏ ఆటగాడూ అందుకోలేడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు. క్రికెట్ పుస్తకంలోని షాట్లనే ఆడటం, దృఢమైన దేహదారుఢ్యమే అన్ని ఫార్మాట్లలో అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా రూపొందించాయని చాపెల్ వెల్లడించాడు. కోహ్లీ ప్రస్తుత బ్యాట్స్‌మన్‌లలో టాప్ పోసిషన్‌లో కొనసాగుతున్నాడు. మనోడికి రికార్డుల రారాజు, చేజింగ్ కింగ్ అనే బిరుదులు ఉన్న విషయం తెలిసిందే.

కోహ్లీనే కింగ్:
తాజాగా ఇయాన్ చాపెల్ యూట్యూబ్‌లో మాట్లాడుతూ... 'ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ టెస్ట్ సారథి జో రూట్‌తో కూడిన బృందంలో మూడు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీయే అత్యుత్తమం. ఇందులో సందేహమే లేదు. మూడు ఫార్మాట్లలో ప్రత్యేకించి పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి రికార్డులు అద్భుతం. కోహ్లీ బ్యాటింగ్ చాలా బాగుంటుంది. అలా చూడాలనిపిస్తోంది' అని పేర్కొన్నాడు.

సంప్రదాయ షాట్లనే కచ్చితత్వంతో ఆడతాడు:
'విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు నాకిష్టం. భారత్ చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు అతడిని మేం ఇంటర్వ్యూ చేశాం. పొట్టి క్రికెట్లో కొత్తతరం, ఫ్యాన్సీ షాట్లు ఎందుకాడవని ప్రశ్నించాం. సుదీర్ఘ ఫార్మాట్లో లయ తప్పకూడదనే ఆ షాట్లు ఆడనని మాతో చెప్పాడు. నా తరంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో వివ్ రిచర్డ్స్ అత్యుత్తమం. అతను సాధారణ క్రికెట్ షాట్లే ఆడేవాడు. బంతిని చక్కగా మిడిల్ చేస్తూ.. వేగంగా పరుగులు సాధించేవాడు. కోహ్లీ కూడా అలానే ఆడుతున్నాడు. సంప్రదాయ షాట్లనే కచ్చితత్వంతో ఆడతాడు' అని ఆసీస్ మాజీ కెప్టెన్ ఛాపెల్ అన్నాడు.

ఫిట్‌నెస్ ఎంతో మేలుచేసింది:
'కోహ్లీ అత్యుత్తమం అయ్యేందుకు ఫిట్‌నెస్ ఎంతో మేలుచేసింది. అతడు వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తుతాడు. తన ప్రమాణాలను తనే పెంచుకుంటాడు. అతడి ప్రదర్శనల్లో కొన్ని అద్భుతం. ఓటమికి భయపడకపోవడం అతడిలో నచ్చే మరో అంశం. గెలిచే ప్రయత్నంలోనే ఓటమికి సిద్ధమవుతాడు. నా దృష్టిలో కెప్టెన్ అంటే.. అలాగే ఉండాలి. ఉద్వేగాలు ఎక్కువ కాబట్టి సారథ్యం అతడి ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావించా. కానీ.. అలా జరగలేదు. తనకుండే భావోద్వేగాన్ని ఉపయోగించుకొని కోహ్లీ మరింత మెరుగయ్యాడు. అతనో తెలివైన క్రికెటర్' అని ఛాపెల్ చెప్పుకొచ్చాడు.

ఎల్బీడబ్ల్యూ రూల్స్ మార్చాలి:
క్రికెట్‌లో ఎల్బీడబ్ల్యూ రూల్స్‌ని సమూలంగా మార్చాలని ఇయాన్ ఛాపెల్ ఇప్పటికే అభిప్రాయపడ్డాడు. 'ఎల్బీడబ్ల్యూ నిబంధనల్ని సడలించాల్సిన అవసరం ఉంది. బంతి వికెట్లపైకి వెళ్లే సమయంలో బ్యాట్‌ని కాకుండా.. మొదటగా ఫ్యాడ్‌ని తాకితే అంపైర్ ఔటివ్వాలి. బంతి ఎక్కడ పిచ్ అయింది అనే విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బంతి ఎక్కడ పడినా.. వికెట్లపైకి వెళ్తూ ఫ్యాడ్‌ని తాకితే ఔటిచ్చేయాలి' అని ఇయాన్ వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications