
హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ 0బ్యాటింగ్ లోపాన్ని సరిచేసేందుకు ఎవరైనా సాయం చేయండి అని వెస్టిండీస్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ కోరాడు. తన బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాన్ని సవరించుకోవడానికి ఎవరైనా నిపుణుడు లేదా క్రికెట్ గురువు సలహా తీసుకోవాలని పేర్కొన్నాడు. షా దేశవాళీ క్రికెట్ ఆడి పరుగులు చేయాలని సూచించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో షా పరుగులు చేయడంలో విఫలమయిన విషయం తెలిసిందే.
అరంగేట్రం చేసిన తొలి నాళ్లలో పరుగుల వరద పారించిన పృథ్వీ షా కొన్నాళ్లుగా భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోనూ అతడిని షార్ట్ పిచ్ బంతులతో బౌలర్లు పెవిలియన్‌కు పంపించారు. ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన షా.. ధాటిగా ఆడినా భారీ స్కోర్ మాత్రం చేయలేకపోతున్నాడు. పదేపదే షార్ట్ పిచ్ బంతులకు ఔట్ అయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులోనైతే ఇన్‌స్వింగర్లతో బోల్తా కొట్టించారు.
పిచ్ అయిన బంతి ఆఫ్ వికెట్‌మీదకు దూసుకొస్తున్నప్పుడు ఆడటంతో పృథ్వీ షా విఫలమవుతున్నాడు. బ్యాటు, ప్యాడ్ల మధ్య నుంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేస్తోంది. దాంతో అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షా దేశవాళీ క్రికెట్ ఆడి పరుగులు చేయాలని ఇయాన్ బిషప్ సూచించాడు. అంతకన్నా ముందు తన బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాన్ని సవరించుకోవాలని కోరాడు.
'పృథ్వీ షా బ్యాటింగ్ లోపం సరిచేసేందుకు నేనేమీ బ్యాటింగ్ సాంకేతిక నిపుణుడు లేదా గురువును కాదు. అందుకు మరెంతోమంది అర్హులైన వారున్నారు. దేశవాళీ క్రికెట్లోకి వెళ్లి పరుగులు చేసినంత సులభం కాదిది. అనుకుంటే దేశవాళీల్లో షా ఎలాగైనా, ఎన్నైనా పరుగులైనా చేయొచ్చు. అతడి లోపాన్ని సరిచేసేందుకు, బ్యాటింగ్ తుది మెరుగులు పెట్టేందుకు ఎవరైనా సాయపడాలి. మార్పు చేసుకున్న టెక్నిక్‌కు షా అలవాటు పడాలి. అప్పుడు దేశవాళీల్లోకి వెళ్లి పరుగులు చేసి ఆత్మవిశ్వాసం, ఫామ్ తెచ్చుకోవాలి' అని ఇయాన్ బిషప్ అన్నాడు.