
నాటింగ్‌హామ్: ఫామ్ లేమితో ఆడుతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ సీనియర్ ఓపెనర్ అలెస్టర్ కుక్‌కు ఆ జట్టు కోచ్ అండగా నిలిచాడు. అతడు బంతిని చక్కగా బాదుతున్నాడని కోచ్ ట్రెవర్ బేలిస్ పేర్కొన్నాడు. టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌లో ఓపెనర్ కుక్‌పై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌ల నుంచి అతను హాఫ్ సెంచరీ మైలురాయిని అధిగమించలేకపోయాడు. కుక్ 12వ ఓపెనింగ్ భాగస్వామి కీటన్ జెన్నింగ్స్ 14 ఇన్నింగ్స్‌ల నుంచి విఫలమవుతున్నాడు.
'కుక్‌లో ఎలాంటి మార్పూ లేదు. పరుగులు చేస్తున్నప్పుడు ఎలా సాధన చేస్తున్నాడో ఇప్పుడూ అంతే. నెట్స్‌లో అతడి ఆటను చూస్తే బంతిని చక్కగా బాదుతున్నట్టు కనిపిస్తుంది. ఫుట్‌వర్క్ సైతం బాగుంది. అతడు బంతిని బాదుతున్నంత వరకు ఫామ్‌లో లేడని అనలేం. బ్యాక్‌ఫుట్‌పై తన లయను మెరుగు పరుచుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో మా కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు. వారిదంతా దూకుడు శైలి. వెంటనే దీన్ని మార్చుకోవడం కుదరదు'
'గత మ్యాచ్ ఫలితంగా గురించి ఆదివారం రాత్రి చర్చించాం. ఇలా ఎలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది. ఏం చేస్తే దీనిని ఆపగలం. అనే అంశాలపై చర్చించాం. మూడో టెస్టులో ఓడినట్లుగా మళ్లీ ఓటమి దరిచేరకుండా ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఇలా మాట్లాడుకోవడం మొదటి సారేం కాదు. బెన్ స్టోక్స్.. జోస్ బట్లర్‌లతో మాట్లాడినప్పుడు వాళ్లు కూడా తమ అభిప్రాయాలు తెలియజేశారు. మూడో టెస్టులో బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్ తరహాలో ఆడేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు.'
'జానీ బెయిర్‌స్టో తర్వాతి మ్యాచ్‌లో కీపింగ్ చేయడం కష్టమే. వైద్యబృందం సూచనల మేరకు అతడిని ఆడిస్తాం. కొన్నాళ్లు కీపింగ్‌ను పక్కన పెట్టేసి బ్యాట్స్‌మెన్‌గా కొనసాగించాలని అనుకుంటున్నాం. జానీని ఒప్పించడం కష్టమే అయినప్పటికీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా తప్పదు. శామ్‌కరన్ తొలి రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడాడు. కొన్ని సార్లు బాగా ఆడుతున్నా ఆటగాళ్లను పక్కనపెట్టాల్సి వస్తుంది' అని బేలిస్ అన్నాడు.