కరాచీ: యూరీ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్.. క్రికెట్, రాజకీయాలపై స్పందించాడు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కొనసాగాలంటే రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించాడు.
ఒక ఆటగాడిగా తాను భారత్‌తో ఆడటానికే ఇష్టపడతానని హక్ చెప్పాడు. భారత్‌పై ఆడే తమ జట్టుకు నాయకత్వం వహించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు మిస్బా. అయితే రాజకీయాలు, క్రికెట్‌ను విడివిడిగా చూడాలని, లేకపోతే క్రికెట్ సంబంధాలు కొనసాగడం కష్టమని స్పష్టం చేశాడు.
మిస్బా.. పాక్‌కు 2010 నుంచి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌పై కెప్టెన్‌గా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ పరిమిత ఓవర్ల ఫార్మెట్‌లో మాత్రం పాక్ జట్టుకు భారత్‌పై ఆడినప్పుడు నాయకత్వం వహించాడు. అయితే అది భారత్‌లో జరిగిన మ్యాచ్‌లకు కాదు.

2007 నుంచి ఇప్పటి వరకూ భారత్ ఒక్కసారి కూడా పాకిస్థాన్‌తో సరైన ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌ను ఆడలేదు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల కోసం పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉందని, కానీ ఇండియా నుంచి మాత్రం సరైన స్పందన లేదని మిస్బా తెలిపాడు.
కాగా, యూరీ ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పాక్ జట్టుతో క్రికెట్ అంశంపై తీవ్రంగా స్పందించారు. ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేది లేదని తేల్చి చెప్పాడు. గత 9ఏళ్లుగా భారత్ ఇదే వైఖరిని అవలంభిస్తోందని అన్నారు.