ఇస్లామాబాద్: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన దృష్టిలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీనేనని తెలిపాడు. అతడ్ని ఎదుర్కొవడం ఏ బౌలర్‌కైనా కష్టమేనని స్పష్టం చేశాడు.
టెస్ట్ అయినా, వన్డే అయినా, చివరకు టీ20 అయినా... మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ నిలకడ కొనసాగిస్తున్నాడని తెలిపాడు. ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరని తననడిగితే... విరాట్ కోహ్లీనే అని టక్కున చెప్పేస్తానని అక్రమ్ పేర్కొన్నాడు.

'స్పోర్ట్స్ టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ప్రతిభాపాటవాలను ఆకాశానికెత్తేసిన అక్రమ్... కోహ్లీకి బౌలింగ్ వేయాలంటే చాలా కష్టమైన పనేనంటూ వ్యాఖ్యానించాడు. కొన్ని క్లిష్టమైన బంతులను కూడా కోహ్లీ ఎంతో సులభంగా ఆడేస్తున్నాడని వన్లేల్లో 502, టెస్టుల్లో 414 వికెట్లు తీసిన బౌలర్ అయిన వసీం తెలిపాడు.
మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కోహ్లీ వెన్నెముక లాంటి ఆటగాడని కితాబిచ్చాడు. ఏ ఫార్మాటైన అతను పరుగులు రాబట్టేస్తాడని తెలిపాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నీలో కోహ్లీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి టీ20 ప్రపంచ కప్ టోర్నీలోనూ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడతాడని అంచనాలున్నాయి.