సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉన్న 11 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతూ స్టార్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ భావోద్వేగానికి గురయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడినప్పటికీ.. ఆరెంజ్ ఆర్మీతో ప్రేమ కొనసాగుతుందని భువీ పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ అభిమానుల ప్రేమ ఓ అద్భుతమని తెలిపాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో భువనేశ్వర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే కనీస ధర రూ.2 కోట్లతో వేలానికి వచ్చిన భువనేశ్వర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బిడ్ వేయలేదు. ఈ పేసర్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే రూ.10.50 కోట్ల తర్వాత భువీ కోసం ఆర్సీబీ బిడ్‌ను వేసి దక్కించుకుంది. 2014లో భువనేశ్వర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ.4.25 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి ఫ్రాంచైజీలోనే కొనసాగించింది. కానీ 34 ఏళ్ల ఈ స్వింగ్ కింగ్‌ను రిటైన్ చేసుకోని సన్‌రైజర్స్ యాజమాన్యం వేలంలోనూ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించలేదు.

ఐపీఎల్ 176 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ 181 వికెట్లు పడగొట్టాడు. లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంలో భువీ కీలక పాత్ర పోషించాడు. 2016, 2017 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసి వరుసగా పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. వరుసగా రెండు సార్లు పర్పుల్ క్యాప్‌ను అందుకున్న బౌలర్‌గా భువనేశ్వర్ చరిత్ర సృష్టించాడు. అయితే 2009లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన భువీ తిరిగి తమ తొలి ఫ్రాంచైజీకి చేరాడు.
''సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 11 ఏళ్ల అద్భుత ప్రయాణం తర్వాత గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో ఎన్నో మరుపురాని అనుభూతులు, తిరుగులేని విజయాలు ఉన్నాయి. ఇక్కడ ఓ అద్భుతమైన విషయం.. అభిమానుల ప్రేమ. మీ మద్దతు నిరంతరం కొనసాగింది. మీ ప్రేమ, మద్దతును నాతో ఎప్పటికీ కొనసాగిస్తాను'' అని భువనేశ్వర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.