ఐపీఎల్.. తమకు భిన్న ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం కల్పించిందని అన్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. ఈ ఐపీఎల్ వల్ల ఆటగాళ్లతో మంచి అనుబంధం ఏర్పడుతుందని చెప్పాడు. అలానే జోస్ బట్లర్ తో తనకున్న అనుబంధాన్ని వివరించాడు సంజూ. జోస్ బట్లర్ తమ జట్టును వీడి వెళ్లిపోయాడన్న విషయాన్ని తాను జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టిందని అన్నాడు.
"ఐపీఎల్.. జట్టుకు ముందుండి నడిపించే బాధ్యతతో పాటు ఉన్నత స్థాయిలో ఆడే అవకాశాన్ని కల్పించింది. అలానే ఇతరులతో మంచి స్నేహబంధాలను ఏర్పుచుకునే అవకాశాన్ని ఇచ్చింది. నా క్లోజ్ ఫ్రెండ్స్ లో జోస్ బట్లర్ ఒకడు. మేం ఇద్దరం ఏడేళ్లు కలిసి ప్రయాణం చేశాం. లాంగ్ బ్యాటింగ్ పార్టర్న్‌షిప్‌ను నమోదు చేశాం. మేం ఇద్దరం ఒకరినొకరు బాగా తెలుసు. ఎప్పుడూ టచ్ లోనే ఉంటాం."
"అతడు నాకు పెద్దన్నయ్య లాంటి వాడు. నేను సారథిగా ఎంపికైనప్పుడు, అతడు నా వైస్ కెప్టెన్. జట్టును నేను ముందుండి నడిపించడంలో నాకు ఎంతో సాయంగా నిలిచాడు. కీలకంగా వ్యవహరించాడు. అతడు ఇప్పుడు వెళ్లిపోవడం నాకు పెద్ద ఛాలెంజ్ లాంటిది. అతడు ఐపీఎల్ లో ఇక రాజస్థాన్ తరఫున ఆడడు అన్న విషయాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇంగ్లాండ్ సిరీస్ సమయంలోనూ అతడితో ఈ విషయాన్ని చెప్పాడు. నాకు అవకాశం ఉంటే ఐపీఎల్ ఓ రూల్ ను మార్చేస్తాను. ప్లేయర్స్ రిలీజ్ చేసే నిబంధనను మార్చేస్తాను. ప్లేయర్స్ ను రిలీజ్ చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎన్నో ఏళ్ల పాటు కలిసి ఉన్న బంధాలు దూరమయ్యే అవకాశం ఉంది. రాజస్థాన్ తో కోచ్ లు, ఓనర్స్, అలానే జట్టుతో ఉన్న నాతో సహా ప్రతిఒక్కరికి.. అతడు లేకపోవడం కాస్త కష్టమైన విషయమే. జోస్ బట్లర్ మా కుటంబంలోని వ్యక్తి లాంటివాడు" అని శాంసన్ చెప్పుకొచ్చాడు.

కాగా, ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ముందు జోస్ బట్లర్ ను రిలీజ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. శాంసన్, జైశ్వాల్, రియాన్ పరాగ్,ధ్రువ్ జురెల్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్ రిటైన్ చేసుకుంది. బట్లర్ ను వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.