స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి 429 రోజుల తర్వాత భారత్ తరపున టీ20 క్రికెట్ ఆడనున్నాడు. గత టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమిపాలైన తర్వాత రోహిత్ శర్మతో పాటు కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు దూరమైన విషయం తెలిసిందే. స్వదేశంలో జరగనున్న అఫ్గానిస్థాన్ సిరీస్‌కు వీరిద్దరు ఎంపికయ్యారు. అయితే తొలి టీ20లో రోహిత్ రీఎంట్రీ ఇవ్వగా, వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరమయ్యాడు. ఇవాళ ఇండోర్ వేదికగా జరగనున్న రెండో టీ20లో విరాట్ బరిలోకి దిగనున్నాడు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ఈ వీడియోలో టెన్నిస్ దిగ్గజం,సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ గురించి కోహ్లి మాట్లాడాడు. కోహ్లితో తనకి ఉన్న అనుబంధం గురించి జకోవిచ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ''కోహ్లిని ఎంతో అభిమానిస్తాను. గత కొన్నాళ్లుగా చాట్ చేస్తున్నా మేం ఇప్పటివరకు నేరుగా కలుసుకోలేదు. అది త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నా. అతడు నా గురించి చెప్పిన మాటలు వినడం ఎంతో గౌరవంగా, ప్రత్యేకతగా భావిస్తున్నా'' అని జకోవిచ్ అన్నాడు.

దీనికి కోహ్లి స్పందిస్తూ.. ''ఇన్‌స్టాగ్రామ్‌లో జకోవిచ్ ప్రొఫైల్ ఒకసారి చూశాను. మెసేజ్ చేద్దామని ఓపెన్ చేశా. అయితే అప్పటికే అతడి నుంచి మెసేజ్‌లు వచ్చాయి. అతడే చేశాడా? అసలు ఇది నిజమైనా అకౌంటేనా అని చెక్ చేశా. ఆ తర్వాత టచ్‌లో ఉన్నాం. సాధించిన ఘనతలకు పరస్పరం అభినందించుకుంటాం. ఇటీవల వన్డేల్లో 50వ సెంచరీ సాధించిన తర్వాత కూడా జకోవచ్ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రపంచ అథ్లెట్లతో మాట్లాడటం ఆనందంగా ఉంది. త్వరలోనే అతడిని కలుస్తాను. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న అతడికి ఆల్ ది బెస్ట్'' అని కోహ్లి చెప్పాడు.
మెన్స్ సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన రికార్డు నొవాక్ జకోవిచ్ పేరిట ఉంది. అతడు ఇప్పటివరకు 24 టైటిళ్లు అందుకున్నాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో మార్గరెట్ కూడా 24 టైటిళ్లు అందుకుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయం సాధించి ఓవరాల్‌గా టాప్‌లో నిలవాలని జకోవిచ్ పట్టుదలతో బరిలోకి దిగుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను జకోవిచ్ ఇప్పటివరకు 10 సార్లు గెలవడం విశేషం. కాగా, ఇవాళ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ డినో ప్రిజ్మిక్‌తో అతడు పోటీపడనున్నాడు.