
ఎంతో గర్వంగా ఉంది:
ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించి నేటికి సరిగ్గా ఏడాది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అప్పటి విశేషాలను గుర్తు చేసుకున్నాడు. అత్యంత ఉత్కంఠ భరితమైన ఫైనల్ మ్యాచ్‌లో తాము గెలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందించిందని మోర్గాన్ చెప్పాడు. దశాబ్దాల నాటి తమ దేశ కలను నెరవేర్చినందుకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్ చేసిన 241 పరుగులు సులభంగా చేజ్ చేసేలా కనిపించినా.. ఆ జట్టు పటిష్ఠమైన బౌలింగ్‌తో తమను కట్టడిచేసిందని, దాంతో గెలిచేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందన్నాడు.

ప్రపంచం ఒక్కసారిగా స్థంభించిపోయింది:
'జిమ్మీ నీషమ్ వేసిన స్లో బంతిని బెన్ స్కోక్స్ సిక్సర్‌గా మలచబోయాడు. అదే తరహాలో లియామ్ ప్లంకెట్ అంతకు ముందు బంతికే క్యాచ్‌గా వెనుతిరిగాడు. వెంటనే స్టోక్స్ కూడా అదే దిశలో సిక్స్ కొట్టబోయాడు. అయితే ఆ బంతిని బౌండరీ వద్ద ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ పట్టేసుకున్నాడు. అంతే నా ఊపిరాగినంతపనైంది. ప్రపంచం ఒక్కసారిగా స్థంభించిపోయింది. అంతా అయిపోయిందనిపించింది. అప్పటికే ఓవర్‌కు 15 పరుగుల చొప్పున చేయాల్సి ఉంది. ఇక స్టోక్స్ కూడా అవుటైతే ఎలా.. అనే ఆలోచన నా మదిలో ఉంది. అయితే ఈ క్యాచ్ అందుకున్న బౌల్ట్ అనుకోకుండా బంతి చేతిలో ఉండగానే బౌండరీని తొక్కేశాడు. దీంతో అది సిక్సర్‌గా ప్రకటించారు. అప్పుడు న మనసు తేలికైంది' అని మోర్గాన్ చెప్పాడు.

ఆదుకున్న స్టోక్స్:
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 241/8 స్వల్ప స్కోర్ చేసింది. హెన్రీ నికోల్స్ (55), టామ్ లాథమ్ (47), కేన్ విలియ్సన్ (30) మోస్తారు స్కోర్లతో జట్టును ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు క్రిస్ వోక్స్ (3/37), లియమ్ ప్లంకెట్ (3/42) చెలరేగడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం న్యూజిలాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టుకు లక్ష్యం చిన్నదైనా కొండంతలా పెరిగింది. మధ్యలో స్టోక్స్(84), బట్లర్ (59) ఆదుకోడంతో ఆ జట్టు నిలదొక్కుకుంది. 45వ ఓవర్‌లో బట్లర్ ఔటయ్యాక కివీస్ బౌలర్లు పుంజుకున్నారు. టెయిలెండర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్టోక్స్ ఒంటరి పోరాటం చేశాడు.

మ్యాచ్ టై:
చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన స్థితిలో బౌల్ట్ బౌలింగ్ చేశాడు. స్టోక్స్, అదిల్ రషీద్ క్రీజులో ఉన్నారు. తొలి రెండు బంతులకు పరుగులు రాకపోవడంతో స్టోక్స్ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్లో షాట్ ఆడి రెండు పరుగులు తీశాడు. కానీ స్టోక్స్ రెండో పరుగుకోసం ప్రయత్నించగా అప్పుడే ఫీల్డర్ బంతిని అందుకొని త్రో విసిరాడు. అది నేరుగా వెళ్లి డైవ్ చేస్తున్న స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ చేరింది. అలా ఓవర్‌త్రో కారణంగా నాలుగు అదనపు పరుగులు లభించాయి. మొత్తంగా ఆ బంతికి 6 పరుగులు వచ్చాయి. ఇక రెండు బంతుల్లో 3 పరుగులే కావాలి. ఐదో బంతికి రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించగా.. రషీద్ రనౌటయ్యాడు. చివరి బంతికి మళ్లీ రెండు పరుగులు అవసరం కాగా.. ఈసారి మార్క్‌వుడ్ రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

సూపర్ ఓవర్ టై:
సూపర్ ఓవర్‌లో బట్లర్, స్టోక్స్ బ్యాటింగ్‌కు దిగారు. బౌల్ట్ బౌలింగ్ చేశాడు. ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడి 15 పరుగులు రాబట్టారు. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్ కూడా అన్నే పరుగులు చేసింది. జేమ్స్ నీషమ్, మార్టిన్ గప్తిల్ బ్యాటింగ్ చేశారు. వీళ్లు కూడా బాగా ఆడడంతో మరోసారి స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్ మరోసారి టై అయినా బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications












