
హైదరాబాద్: భారత క్రికెట్ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేశామని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చారు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సరిగ్గా ఏడాది ముందు తన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కాల పరిమితి పూర్తవుతున్నందన్న ఎలాంటి బాధలేదని ఎమ్మెస్కే తెలిపారు.
గత ఆదివారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత కమిటీకి పొడిగింపు ఇవ్వలేమని సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "సెలక్షన్ కమిటీ పొడిగింపు గురించి నేను మాట్లాడలేను" అని అన్నారు.
"బీసీసీఐ ఏది భావ్యం అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటుంది. బోర్డు తన విధి విధానాల అనుసరించి పని చేస్తుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ఏడాది ముందే పదవీ కాలం పూర్తైనందుకు బాధ పడటం లేదు. ప్రతిదానికీ ఓ కాలపరిమితి ఉంటుంది. మనకు ఉన్న సమయంలోనే అత్యుత్తమంగా పనిచేయాలి" అని ఎమ్మెస్కే అన్నారు.
"నా నేతకృత్వంలోని సెలక్షన్ కమిటీ కూడా అదే చేసిందని అనుకుంటున్నా. టీమిండియాకు దృఢమైన రిజర్వు బెంచ్‌ను రూపొందించాం. సరైన కూర్పు దొరికితే వచ్చే ఏడాది టీమిండియా కచ్చితంగా వరల్డ్‌కప్‌ను గెలుస్తుంది" అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చారు. 2016లో ఎమ్మెస్కే సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.