కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాపై గెలవాల్సిన నాలుగో వన్డే మ్యాచ్ చేజారడంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. ఓటమికి తనదే బాధ్యత అని ఆయన అన్నాడు. 349 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించగలదని ఒక సందర్భంలో అనిపించింది.
అయితే 37 ఓవరు తర్వాత మ్యాచ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 277 పరుగులకు ఒక వికెట్ కోల్పోయిన భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులు చేసి చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా పేసర్ రిచర్డన్స్ ఐదు వికెట్లు తీశాడు. ఐదు వన్డేల సిరీస్‌ను 4-0 స్కోరుతో గెలుచుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉంది.
ఆస్ట్రేలియా స్వదేశంలో వరుసగా 19 మ్యాచులు గెలిచి రికార్డు సృష్టించింది. శిఖర్ ధావన్ (126), విరాట్ కోహ్లీ (106) సెంచరీలు వృధా అయ్యాయి. వారిద్దరు అవుటైన తర్వాత భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ ధోనీ మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. అజింక్యా రహనే ఫీల్డింగ్‌లో గాయపడి కుడిచేతికి కుట్లతో ఆలస్యంగా బ్యాటింగ్‌కు దిగాడు.
తనకు కోపమే రావడం లేదని, అసంతృప్తిగా ఉందని ధోనీ అన్నాడు. ఓటమికి బాధ్యత తానే తీసుకుంటున్నానని, ఎందుకంటే మ్యాచ్‌ను ముగించాల్సింది తానేనని అన్నాడు. గెలిచే అవకాశాలున్నప్పటికీ ఓడిపోయామని అన్నాడు. ఐదో వన్డే సిడ్నీలో శనివారం జరుగుతుంది.