భారత్ జగజ్జేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్‌గా అవతరించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. సమష్టి విజయంతో రోహిత్ సేన ట్రోఫీని అందుకుంది. కానీ ఫైనల్లో గేమ్ ఛేజింగ్ మూమెంట్ మాత్రం.. సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్! నరాలు తెగే ఉత్కంఠలో సూర్య కష్టమైన క్యాచ్‌ను అందుకున్న తీరు చరిత్రలో నిలిచిపోతుంది.
ఓ వైపు బంతిని గమనిస్తూ.. మరోవైపు బౌండరీ రోప్‌ను అంచనా వేస్తూ...చిరుతలా పరిగెత్తుతూ సూర్యకుమార్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. సౌతాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరమవ్వగా హార్దిక్ వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్సర్‌గా దూసుకెళ్లిన ఈ బంతిని సూర్య బౌండరీ లైన్‌పై చాకచక్యంగా అందుకున్నాడు.

ముందుగా సిక్సర్‌ను అడ్డుకొన్న సూర్య, తర్వాత సమన్వయం కోల్పోవడంతో బంతి గాల్లోకి విసిరాడు. బౌండరీ రోప్ దాటి, మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అది సిక్సర్‌గా మారినా, మిల్లర్ నాటౌట్‌గా నిలిచినా ఫలితం మరోలా వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాచ్ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ అని సూర్యను భారత క్రికెటర్లు, మాజీలు, అభిమానులు ప్రశంసించారు.
కాగా, ఈ కళ్లుచెదిరే క్యాచ్ గురించి సూర్యకుమార్ స్పందించాడు. సిక్సర్‌గా వెళ్తున్న బంతి తనకి వరల్డ్ కప్‌లా కనిపించిందని, అది మిస్ అయితే కప్ చేజారుతుందేమో అని ఒడిసిపట్టానని సూర్య తెలిపాడు. ''ఆ సమయంలో నా మైండ్‌లో ఏం ఆలోచన ఉందో నాకు తెలియదు. కానీ వరల్డ్ కప్ ఎగిరిపోతుందని కనిపించింది. దాన్ని ఒడిసిపట్టాను అంతే'' అని సూర్య పేర్కొన్నాడు. కాగా, 1983 వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలవడంలో కపిల్ దేవ్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ కీలక పాత్ర పోషించింది. అదే తరహాలో ఈ ప్రపంచకప్ గెలవడంలో సూర్య అందుకున్న క్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ క్రికెటర్లు సూర్యను కొనియాడుతున్నారు.