హైదరాబాద్: టీ20ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాదిరి తాను కూడా దూకుడుగా ఆడాలని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని గతవారంలో తప్పుకున్న సంగతి తెలిసిందే. ధోని తప్పుకున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను సెలక్టర్లు విరాట్ కోహ్లీకి అప్పగించారు.
ఇప్పటివరకు కోహ్లీ నేతృత్వంలో టెస్టుల్లో ఆడిన అశ్విన్ ఇకపై వన్డేలు, టీ20ల్లో ఆడనున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యాలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇన్నాళ్లు కూల్‌గా సాగిన తన క్రికెట్ భవిష్యత్తు ఇకపై కూల్‌గా ఉంటుందో లేదోనని అశ్విన్ ఆందోళన చెందుతున్నాడు.
దూకుడు స్వభావం కలిగి ఉన్న కోహ్లీ ధోని కెప్టెన్సీ వీడ్కోలు అనంతరం మూడు ఫార్మెట్లకు సారథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అశ్విన్ దూకుడుతో కోహ్లీ తీసుకునే నిర్ణయాలకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు.

2010లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభం నుంచి ధోనీ కెప్టెన్సీలోనే వన్డేలు, టీ20లు ఆడుతూ వచ్చానని చెప్పాడు. జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి వన్డేలో ధోనీ కెప్టెన్సీలో ఆడకపోవడం కొత్తగా ఉందని అన్నాడు. గతంలో ధోని వికెట్ కీపర్‌గా ఉంటూనే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని అన్నాడు.
ఇప్పుడు కోహ్లీ షార్ట్ మిడ్ వికెట్, షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తాడని, అతడి వ్యూహాలకు తగ్గట్టుగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ధోని అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు ప్రాధాన్యం ఇచ్చి పరుగులు తగ్గిస్తాడని, కోహ్లీ మాత్రం ఈ ఓవర్లలోనూ అటాకింగ్ గేమ్ ప్లాన్ ఆడతాడని చెప్పాడు.
ఈ సమయంలో కోహ్లీ వికెట్లు తీయడంపైనే దృష్టిసారిస్తాడని చెప్పిన అశ్విన్, ఇదే మ్యాచ్ ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తెలిపాడు. ముఖ్యంగా కఠిన సమయాల్లో జట్టుకు అనకూలంగా ధోని తీసుకునే వ్యూహాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నాడు.