హైదరాబాద్: దేశం కోసం 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాను అంతేకానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోసం కాదంటూ పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తన వీడ్కోలుపై వస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించాడు. వీడ్కోలు మ్యాచ్ కోసమే ఎదురుచూస్తూ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించడం లేదంటూ గత కొంతకాలంగా అఫ్రిదిపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తనపై వస్తున్న వార్తలపై అఫ్రిది తాజాగా మీడియాతో మాట్లాడాడు. 'నేను ఇప్పటికే 20 ఏళ్ల పాటు దేశం కోసం క్రికెట్ ఆడాను. అంతేకాని పీసీబీ కోసం మాత్రం కాదు. ఒక మ్యాచ్ కోసం పీసీబీ అభ్యర్థించడం ఎప్పటికీ జరగదు. నన్ను నేను నమ్ముకున్నా. అంతేకానీ ఎవరిపైనా ఆధారపడలేదు' అని చెప్పాడు.
'పాక్ బోర్డును ఫేర్ వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయమని ఏనాడూ కోరలేదు. ప్రస్తుతం నా కెరీర్ ముగిసిపోయిందని నేను అనుకోవడం లేదు. జాతీయ జట్టుకు ఆడేందుకు ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను. అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతే నాకు అండగా ఉన్నారు' అంటూ అఫ్రిది చెప్పుకొచ్చాడు.

కాగా, కొన్ని రోజుల క్రితం తన రిటైర్మెంట్ కోసం వీడ్కోలు మ్యాచ్ నిర్వహించమని పీసీబీని ఆఫ్రిది కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ముగిసిన ఆసియా, వరల్డ్ టీ20 టోర్నీల్లో పాక్ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి అఫ్రిది తప్పుకున్నాడు.
అప్పటి నుంచి సెలక్టర్లు ఆఫ్రిదిని ఏ జట్టులో కూడా ఎంపిక చేయడం లేదు. దీనిలో భాగంగానే తన వీడ్కోలుకు ఒక మ్యాచ్ నిర్వహించాలంటూ ఆఫ్రిది కోరినట్లు వార్తలు వచ్చాయి. దానిపై తాజాగా స్పందించిన ఆఫ్రిది అందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పాడు.