IPL 2025: ఐపీఎల్‌లో 17 ఏళ్ల నిరీక్షణను ముగిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఛాంపియన్‌గా మారిన మరుసటి రోజే జట్టు సంబరాలు విషాదంగా మారాయి. చిన్నస్వామి స్టేడియంలో జట్టు విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని ప్రభావం ఆర్సీబీ జట్టుతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌పై పడింది. ఈ కేసులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
ఈ వివాదం తర్వాత ఆర్సీబీ బ్రాండ్ విలువపై కూడా గణనీయమైన ప్రభావం పడింది. ఆర్సీబీ జట్టును విక్రయించే ఆలోచనలో ఉన్నారని కూడా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కొనుగోలు చేయడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆసక్తితో ఉన్నారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే తాజా ప్రకటనలో డీకే శివకుమార్ ఈ పుకార్లను పూర్తిగా ఖండించారు.

ఆర్సీబీ కొనుగోలుపై డిప్యూటీ సీఎం ఏమన్నారంటే?
ఆర్సీబీని కొనుగోలు చేస్తున్నారనే వార్తలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పూర్తిగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. "నేను పిచ్చోడిని కాదు. నేను చాలా కాలంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌తో మాత్రమే అనుబంధం కలిగి ఉన్నాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. నాకు సమయం లేదు. అయితే మేనేజ్మెంట్‌లో భాగం కావాలని నాకు ఆఫర్ వచ్చింది. నాకు ఆర్సీబీతో ఏం పని? నేను కనీసం 'రాయల్ ఛాలెంజ్' కూడా తాగను" అని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. ఆర్సీబీని విక్రయిస్తున్నారనే పుకార్లను జట్టు యజమానులు కూడా పూర్తిగా ఖండించారు. అయితే ఈ వార్తలను ఆర్సీబీ యాజమాన్యం అయినటువంటి డియాజియా కంపెనీ ఖండించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీని విక్రయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ ఊహాజనితాలేనని వెల్లడించింది. ఆర్సీబీ అమ్మకానికి చర్చలు కూడా జరగలేదని పేర్కొంది. ఇండియాలో ఆల్కహాల్, పొగాకు బ్రాండ్ల ప్రమోషన్‌పై నిషేధం ఉన్నా మా ఉత్పత్తులను ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేసుకుంటామని.. దానికి, ఆర్సీబీ అమ్మకానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఇలా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి తెరదించింది. వారు బీఎస్‌ఈ పర్యవేక్షణ విభాగానికి రాసిన లేఖలో ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేశారు
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 33 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైకోర్టు కూడా ఈ విషయంలో కఠిన వైఖరిని అవలంభించింది. కోర్టు ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ జూన్ 12న జరగనుంది.