
ఓటమిపాలైనా ఆందోళన చెందం
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'కివీస్ పర్యటనలో నేను బాగానే ఆడుతున్నా. కొన్నిసార్లు మంచి స్కోర్లు చేయనంత మాత్రాన బ్యాటింగ్ విధానం మారినట్లు కాదు. దీర్ఘ కాలంగా తీరిక లేకుండా ఆడటం వల్ల ఒక్కోసారి రాణించలేం. బయట చాలా మాట్లాడుకుంటున్నారు. అయితే నేను ఒక్క ఇన్నింగ్స్ బాగా ఆడితే బయట మాట్లాడుకునే పరిస్థితులు మారిపోతాయి. అయితే నేను అలా ఆలోచించేవాడిని కాదు. బయటివాళ్లు ఏమనుకుంటున్నారోనని ఆలోచిస్తే.. నేను కూడా వారి మధ్యే ఉండేవాడిని. చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకొని ప్రాక్టీస్ సెషన్‌లో మరింత కష్టపడితే సరైన ఫలితాలొస్తాయి' కోహ్లీ అన్నాడు.

విమర్శలను పట్టించుకోను
'జట్టు విజయం సాధించినప్పుడు 40 పరుగులైనా సరిపోతాయి, అదే ఓటమిపాలైతే సెంచరీ చేసినా ఉపయోగం ఉండదు. నేను అలాంటి ఆలోచన దృక్పథంతోనే ఉంటా. బయటి నుంచి ఎదురయ్యే విమర్శలను పట్టించుకోను. తదుపరి మ్యాచ్‌లో ఎలా రాణించాలనే దానిపైనే దృష్టి పెడుతా. ఎలాంటి జట్టునైనా, ఎక్కడైనా ఓడించగల సత్తా మాకుందని తెలిసి కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. ఒకవేళ భారత్ రెండో టెస్టులో ఓటమిపాలైనా.. మేము ఆందోళన చెందం. ఎందుకంటే.. అంతర్జాతీయ స్థాయిలో ఆడటం అంత తేలిక కాదు. ఆటలో గెలుపోటములు సహజం. ఓటముల నుంచే తప్పులను సరిదిద్దుకోవాలి' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

పోటీ ఇవ్వలేకపోయాం
'మొదటి రోజు టాస్ చాలా ముఖ్యమైనది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న మేము ఈ మ్యాచ్‌లో పోటీ ఇవ్వలేకపోయాం. కివీస్ బౌలర్లు ఇంతలా ఒత్తిడికి గురిచేస్తారనుకోలేదు. మేం 220-230 స్కోర్ చేసినా సరిపోయేది కాదు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తక్కువ పరుగులే మ్యాచ్‌లో మేం వెనుకపడేలా చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ఆధిక్యాన్ని 100లోపే కట్టడి చేయాలనుకున్నాం. కానీ.. చివరి మూడు వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు' అని అన్నాడు.

విదేశీ పిచ్‌లపై రాణించలేడు
భారత్ గడ్డపై టెస్టుల్లో సెంచరీల మోత మోగించే కోహ్లీ.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పిచ్‌లపై నిలకడగా రాణించలేడనే అపవాదు ఉంది. తాజాగా కివీస్ పర్యటనలో టీ20, వన్డేల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఇక తొలి టెస్టులోనూ 2, 19 పరుగులే చేసాడు. తొలి ఇన్నింగ్స్‌లో జెమీషన్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతిని వెంటాడుతూ.. స్లిప్‌లో దొరికిపోయాడు. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో ట్రెంట్ బౌల్ట్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని ఫుల్ చేయబోయి కీపర్ చేతికి చిక్కాడు.


Click it and Unblock the Notifications













