బెంగుళూరు: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్, పాకిస్థాన్ లెగ్ స్ఫిన్నర్ యాసిర్‌ల బౌలింగ్‌ను చూసేందుకు తాను ఎంతో ఆసక్తిని చూపిస్తానని ఆస్ట్రేలియా ఆల్ టైమ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మంగళవారం (అక్టోబర్ 18)న వెల్లడించాడు.
ఇటీవల టెస్టు క్రికెట్‌లో వీరిద్దరూ నమోదు చేసిన రికార్డులపై షేన్ వార్న్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌లో అభినందించాడు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరిస్‌లో 27 వికెట్లు తీసుకుని బౌలింగ్ అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు.

అంతేకాదు భారత క్రికెట్ చరిత్రలో వందేళ్లలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డుని అశ్విన్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో స్ట్రయిక్ రేట్ పరంగా చూస్తే, గత వందేళ్లలో అశ్విన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. 'ప్లేయర్ ఆఫ్ ద సిరిస్' అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.
ఇక యాసిర్ విషయానికి వస్తే 17 టెస్టుల్లో 100 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. యాసిర్ (30) దుబాయిలో వెస్టిండిస్‌తో జరిగిన డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు.
ఐతే యాసిర్ ఈ ఘనత సాధించడానికి ముందే అశ్విన్ అతడికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ పెట్టాడు. 'అంతా మంచే జరగాలి. అతడికి బలం చేకూరాలి.'' అని యాసిర్‌ను ఉద్దేశించి అశ్విన్ వ్యాఖ్యానించాడు. యాసిర్.. అశ్విన్ ట్వీట్‌పై స్పందించాడు.
''నాకు శుభాకాంక్షలు చెప్పినందుకు కృతజ్ఞుడిని. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించిన గొప్ప ఆటగాడి నుంచి ఇలాంటి మాటలు రావడం ప్రేరణనిస్తుంది'' అని యాసిర్ పేర్కొన్నాడు. భారత్‌తో తాను ఇప్పటిదాకా టెస్టు మ్యాచ్ ఆడలేదని, ఆ కోరిక ఏదో ఒక రోజు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని అన్నాడు.
గతేడాది షేన్ వార్న్ యాసిర్ షా గురించి మాట్లాడుతూ 'ప్రపంచంలోనే అత్యుత్తమ స్ఫిన్నర్' గా అభివర్ణించాడు. యాసిర్‌కు తానో పెద్ద అభిమానినని, ప్రపంచంలోనే అత్యుత్తమ లెగ్ స్ఫిన్నర్ అంటూ కొనియాడాడు. అతనో అద్భుతమైన బౌలర్ అంటూ ప్రశంసించాడు. కాగా 145 టెస్టు మ్యాచ్‌లాడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీసుకున్నాడు.