భారత్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవడాన్ని చూడటం ఆనందంగా ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైనే అన్నాడు. స్టార్ క్రికెటర్లు లేకుండా టీమిండియా విజయం సాధిస్తుందని పేర్కొన్నాడు. ఇలా 'టీమిండియా-బి' చేతిలో ఓటమిపాలైతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకి తెలుసని టిమ్ పైన్ తెలిపాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్‌తో మాట్లాడుతూ టిమ్ పైన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
2020/21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టార్ క్రికెటర్లు దూరమైనా.. కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను భారత్ చిత్తుచేసిన విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో ఆసీస్ జట్టును నడిపించింది టిమ్ పైన్. ''బెన్ స్టోక్స్‌ను తప్పుపట్టలేం. అతను ఈ సిరీస్‌లో వ్యూహాత్మకంగా రాణించాడు. ఇంగ్లండ్ జట్టులో యంగ్ స్పిన్నర్లు ఉన్నారు. ఉపఖండ్ పిచ్‌లపై యువ స్పినర్లు రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్‌లీ, షోయబ్ బషీర్ రాణిస్తున్నారు. వాళ్ల ప్రదర్శనలో బెన్ స్టోక్స్‌కు కూడా క్రెడిట్ ఉంది''

''అయితే టీమిండియా 'బీ' జట్టుతో ఆడుతోంది. ఎందుకంటే విరాట్ కోహ్లి, మహ్మద్ షమి లేరు. నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. రోడ్డు ప్రమాదం తర్వాత రిషభ్ పంత్ అందుబాటులో లేడు. భారత జట్టు బలంగా లేదు. కానీ భారత క్రికెట్‌లోని లోతు స్ఫస్టంగా తెలుస్తోంది. భారత క్రికెట్‌లో భవిష్యత్ తారలు వస్తున్నారు. జైస్వాల్ ముందుండి నడిపిస్తున్నాడు. గత టెస్టులో ధ్రువ్ జురెల్ సత్తాచాటాడు'' అని హాడిన్ అన్నాడు.
దీనికి టిమ్ పైన్ బదులిస్తూ.. ''ఈ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. భారత-బీ జట్టు చేతిలో పరాజయాన్ని చవిచూస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. దురదృష్టవశాత్తు ఆ ఓటమి మా సొంతగడ్డపై ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ జట్టులో యువ స్పిన్నర్లు వెలుగులోకి రావడం వాళ్లకు కలిసొచ్చే అంశం. ఇంగ్లండ్ ఆడే విధానాన్ని ఆస్వాదిస్తున్నాను. వాళ్ల ఓటమిని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ విషయంలో నన్ను తప్పుపట్టవద్దు. టెస్టుల్లో వాళ్ల ఆట వినోదకరంగా ఉంటుందని చెబుతున్నాను'' అని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ టీమిండియా ఫేవరేట్‌గా నిలిచింది.