బెంగుళూరు: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుకు తానెప్పటికీ అడ్డుకోనని హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా బయల్దేరనున్న నేపథ్యంలో సోమవారం బెంగుళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ మాట్లాడారు.
కోహ్లికి సహజసిద్ధంగా లభించిన దూకుడు అంటే తనకు ఇష్టమని చెప్పాడు. విరాట్ కోహ్లీ దూకుడుకి ఎలా అడ్డుకట్ట వేస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కుంబ్లే పైవిధంగా సమాధానమిచ్చాడు. 'నాకు విరాట్‌లో దూకుడు అంటే ఇష్టం. నేను కూడా నా వరకూ దూకుడుగానే ఉంటా. కొంతమందికి సహజసిద్ధంగా లభించింది ఏదొకటి ఉంటుంది. ఆటగాళ్లలో ఉన్న వారి సహజత్వాన్ని నేను ఎప్పటికీ అడ్డుకోను. విరాట్‌లో నాకు నచ్చింది అతని దూకుడే' అని కుంబ్లే పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. గేమ్‌కు ఆటగాళ్లే అంబాసిడర్లనే సిద్ధాంతాన్ని అనిల్ కుంబ్లే బాగా విశ్వసిస్తాడని ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని తెలిపాడు. ఇండియా క్రికెట్ జట్టుకు, ఇండియాకు అంబాసిడర్లుగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో తెలుసని అన్నాడు.
కోహ్లీ నాయకత్వంలో టీమిండియా మరిన్ని విజయాలను సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. వెస్టిండిస్ పర్యటన తమకు ఓ సవాల్ లాంటిదని కుంబ్లే పేర్కొన్నాడు. ఆ తర్వాత మాట్లాడిన కోహ్లీ కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాడు కోచ్‌గా ఉండటం నిజంగా తమ అదృష్టమని చెప్పాడు.
కుంబ్లేకి ఉన్న అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు. ఇక ప్రస్తుత వెస్టిండిస్ పర్యటనతో తొలి అంతర్జాతీయ సవాల్‌కు కుంబ్లే సిద్ధమయ్యాడని కోహ్లీ తెలిపాడు. జట్టులో లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేసుకుంటామని కోహ్లీ అన్నాడు. ర్యాంకింగ్‌పై దృష్టి లేదని, మంచి క్రికెట్ ఆడడమే తమ ఉద్దేశమన్నాడు.
వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ నెగ్గితే టెస్టుల్లో భారత్ నెం.1గా నిలుస్తుందన్నాడు. స్వదేశమైనా, విదేశమైనా అద్భుతంగా ఆడి విజయం సాధించడమే ముఖ్య ఉద్దేశమన్నాడు. అయితే టీమిండియా మాత్రం ప్రతి సిరీస్‌కు ఒకే విధంగా ప్రాముఖ్యతనిస్తుందని కోహ్లి పేర్కొన్నాడు. ఈ సిరిస్‌ను విజయవంతంగా ముగించి తిరిగి రావడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని అన్నాడు.
కాగా వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. కోచ్‌గా కుంబ్లేకి ఇది తొలి పరీక్ష. తొలి టెస్టు జూలై 21 నుంచి 25 వరకు ఆంటిగ్వాలో ప్రారంభం అవుతుండగా, జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు జమైకాలో రెండో టెస్టు జరుగనున్నాయి.
మూడో టెస్టు ఆగస్టు 9 నుంచి 13 వరకు సెయింట్ లూసియాలో, నాలుగో టెస్టు ఆగస్టు 18 నుంచి 22 వరకు ట్రినిడాడ్‌లో జరుగనున్నాయి. జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరం పూర్తి చేసుకున్న 17 మంది భారత జట్టు సభ్యుల బృందం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనుంది.