
హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టులోని ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లను ధరించిన సంగతి తెలిసిందే. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అమరజవాన్ల మృతికి నివాళిగా టీమిండియా మూడో వ్డేలో ఆర్మీ క్యాప్‌లను ధరించి ఆడారు.
బీసీసీఐ లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్యాప్‌లను భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న ధోనీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకి అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
దీనిపై దాయాది దేశమైన పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్మీ క్యాప్‌లు ధరించి క్రికెట్ ఆడడం సరికాదు అని అన్నాడు. క్రికెట్‌ను రాజకీయం చేస్తున్న బీసీసీఐపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని పాక్ సమాచారశాఖ మంత్రి ఫావద్ చౌదరీ తెలిపారు. కోహ్లీ సేన ఆర్మీ క్యాప్‌లు ధరించిన అంశాన్ని ఐసీసీకి ఫిర్యాదు చేయాలని మంత్రి ఫావద్ పాక్ క్రికెట్ బోర్డును కోరాడు.
మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ అనంతరం వెల్లడించాడు. ఈ నిధులను పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పిల్లల చదువు కోసం వినియోగించనున్నారు.