
హైదరాబాద్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏకంగా 947 పాయింట్లు సాధించి.. ఆల్‌టైం గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్‌కు చేరువగా నిలిచాడు ఆస్ట్రేలియా కెప్టెన్. స్పిన్నర్‌గా, లోయరార్డర్ బ్యాట్స్‌మన్‌గా కెరీర్ ఆరంభించిన స్మిత్ ఈ స్థాయికి చేరుకోవడం ఆశ్చర్యమే. అయితే ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో మేటి బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, కేన్ విలియమ్సన్‌ల స్ఫూర్తితో తాను ఎదిగానని అంటున్నాడు స్మిత్.
''నా చుట్టూ ఉన్న ఆటగాళ్లను చూస్తూ ఎదిగాను. నేను కూడా వారిలా ఆడాలనుకున్నాను. స్పిన్ ఆడటంలో కోహ్లి నైపుణ్యం బాగుంటుంది. ఆఫ్ సైడ్ అతను బంతిని చాలా బాగా ఆడతాడు. అతడి నుంచి ఆ నైపుణ్యాల్ని నేర్చుకున్నా. బ్యాక్ ఫుట్ తీసుకుని షాట్లు ఆడే విషయంలో నేను ఏబీ డివిలియర్స్‌ను అనుకరిస్తాను. కొంచెం ఆలస్యంగా బంతిని ఆడే విషయంలో కేన్ విలియమ్సన్‌ను అనుకరించేవాడిని'' అని స్మిత్ చెప్పాడు.
ఇంకా మాట్లాడుతూ.. 'ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పిచ్‌లలో కొంచెం జాగ్రత్తగా ఆడతానేమో కానీ, భారత్ మైదానాలలో విరుచుకుపడగలను. అంతలా నా ఆటతీరును మార్చుకున్నా' అని స్టీవ్ పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, డివిలియర్స్, కేన్ విలియమ్‌సన్‌లు కాబట్టి వాళ్లని చూసి నేర్చుకోవడానికి సిద్ధపడ్డానని స్మిత్ అన్నాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన స్మిత్ 61 టెస్టులు ఆడి 63.76సగటుతో 6057పరుగులు చేశాడు. 2017 భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఫిబ్రవరి-మార్చిలో మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 499పరుగులు సాధించి అందరికంటే అత్యధిక పరుగులు సాధించినవాడిగా, మూడు సెంచరీలను సైతం నమోదు చేశాడు.