కరోనా లక్షణాలున్నాయని అర్ధరాత్రి క్రికెటర్ మెసేజ్.. పాక్ క్రికెట్‌లో కలకలం!!

కరాచీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్, టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్, షూటింగ్ ప్రపంచకప్, ఐపీఎల్ 2020 సహా ప్రతి టోర్నీ వాయిదా లేదా రద్దు అయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) కూడా సెమీ ఫైనల్ దశలో నిలిపివేయబడింది. ఓ నెల క్రితం పాకిస్థాన్‌లో కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారమే టోర్నీని నిర్వహిస్తామని పీఎస్‌ఎల్ లీగ్ నిర్వాహకులు స్పష్టం చేసారు. అయితే ఒక్క మెసేజ్ పాక్ క్రికెట్‌ను బయాందోళనకు గురిచేసిందని తాజాగా తెలిసింది.

ఓ చిన్న మెసేజ్.. పాక్ క్రికెట్‌లో కలకలం:
ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు పాకిస్థాన్ వెళ్ళాడు. అక్కడికి వెళ్లి కరాచీ కింగ్స్ తరఫున కొన్ని మ్యాచులు ఆడాడు. ఆ తర్వాత ఓ అర్ధరాత్రి కరాచీ కింగ్స్ యజమాని సల్మాన్ ఇక్బాల్‌కి అలెక్స్ హేల్స్ ఓ చిన్న మెసేజ్ పంపించాడు. నాలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి మెసేజ్‌లో పెట్టాడు. ఆపై గంటల వ్యవధిలోనే పీఎస్‌ఎల్‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రద్దు చేసింది. ఆ టోర్నీలో ఆడిన పాక్, విదేశీ క్రికెటర్లను వెంటనే ఇళ్లకు పంపించేశారు.

అర్ధరాత్రి మెసేజ్ వచ్చింది:
తాజాగా బీబీసీతో సల్మాన్ ఇక్బాల్ మాట్లాడుతూ... 'అప్పుడు టైమ్ 2 గంటలు అవుతోంది. నాకు అలెక్స్ హేల్స్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. బాస్.. నాకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనిపిస్తోంది. అందరూ పరీక్షలు చేయించుకోండి' అని తెలిపాడు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే.. వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లాలని అలెక్స్ హేల్స్‌కి సూచించా అని ఇక్బాల్ చెప్పాడు. ఆ వెంటనే.. మనం కలవాలి కోచ్ డీన్ జోన్స్ నుండి కాల్ వచ్చిందని చెప్పాడు.

మేమంతా భయపడ్డాం:
'ఆ రాత్రంతా మేమంతా భయపడ్డాం. లక్షణాలు ఉంటే ఒంటరిగా ఉండాలని అందరికి సూచించాం. ఇక హేల్స్ పరీక్షించటానికి బర్మింగ్‌హామ్ నుంచి ఓ డాక్టర్‌ను తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించాం. లండన్‌లో ఉండే నా డాక్టర్ వద్దకు వెళతావా అని కూడా అడిగాను. కానీ అది జరగలేదు. చివరికి జట్టులోని ప్రతి ఒక్కరినీ పరీక్షించాల్సి వచ్చింది. మరుసటి రోజు టోర్నీని వాయిదా వేసాం' అని సల్మాన్ ఇక్బాల్ పేర్కొన్నాడు.

128 మందికి కరోనా వైరస్ పరీక్షలు:
అలెక్స్ హేల్స్ మెసేజ్‌ని పీసీబీకి సల్మాన్ ఇక్బాల్ చెప్పడం.. ఆ వెంటనే పీఎస్‌ఎల్ టోర్నీ రద్దవడం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఆఖరిగా టోర్నీలోని ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, మ్యాచ్ అధికారులతో కలిపి మొత్తం 128 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ వచ్చింది. అలానే అలెక్స్ హేల్స్‌కి కూడా నెగటివ్ వచ్చింది. దీంతో పీసీబీ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. టోర్నీ రద్దు సమయానికి పాకిస్థాన్‌లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. అయితే నెల తిరిగేసరికి విపరీతంగా పెరిగిపోయాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications