టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి తెలిసిన విషయమే. చాహల్ ధనశ్రీ వర్మను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా ధనశ్రీ వర్మకు మంచి క్రేజ్ ఉంది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ జంట విడాకుల బాట పట్టారు.
విడాకులు తీసుకున్న తరువాత ధనశ్రీ దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, దుబాయ్‌లోని అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. దుబాయ్ నగరం సంస్కృతి, మత సామరస్యాన్ని ఎలా గౌరవిస్తుందో వివరిస్తూ, అక్కడ ఉన్న హిందూ దేవాలయాన్ని సందర్శించి ప్రశాంతతను పొందినట్లు ఆమె తెలిపింది.

మరోవైపు, చాహల్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తమ విడాకులకు పరోక్షంగా ధనశ్రీ వైపు నుంచే తప్పు జరిగిందని సూచించారు. ఈ వివాదాలపై తాను మొదట స్పందించకూడదనుకున్నానని, కానీ ఇప్పుడు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోవట్లేదని అన్నారు. అయితే, చాహల్ వ్యాఖ్యల అనంతరం ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశాంతమైన, ఆధ్యాత్మిక పోస్టును షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.
దీనితో, నెటిజన్లు ఆమె చాహల్‌కు పరోక్షంగా సమాధానం ఇచ్చారని భావిస్తున్నారు. ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, వారి సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెంచుతున్నాయి.