
హైదరాబాద్: వయస్సుతో సంబంధం లేకుండా పరుగుల వర్షం కురిపిస్తోన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీపై పాకిస్థాన్ జట్టు కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. కెప్టెనగా, ఆటగాడిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహంద్రసింగ్ ధోనీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందినట్లు తెలిపాడు పాకిస్థాన్ క్రికెట్ జట్టు సారథి సర్ఫరాజ్ అహ్మద్. జింబాబ్వే పర్యటనకు వెళ్లే ముందు సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడాడు.
'భారత ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీని చూసి చాలా స్ఫూర్తి పొందా. గతంలో అతడు భారత టెస్టు, వన్డే, టీ20 క్రికెట్ జట్లకు నాయకుడిగా ముందుండి నడిపించాడు. అన్ని ఫార్మాట్లలో ఒకరే కెప్టెన్సీ బాధ్యత వహించడం సవాలుతో కూడుకున్నది. ఈ విషయంలో ధోనీ నుంచి నేను చాలా నేర్చుకున్నా' అని చెప్పాడు సర్ఫరాజ్.
'ఇప్పటి వరకు ధోనీని ఒక్కసారి మాత్రమే కలిశాను. అది కూడా గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 4న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా అతన్ని చూసి నేర్చుకోవల్సింది చాలా ఉంది. భారత్‌కు గొప్ప గొప్ప విజయాలు అందించిన ధోనీ ఎంతో నిరాడంబరంగా ఉంటాడు. అతని చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అతన్ని ఒకసారి కలిసి మాట్లాడాను' అని సర్ఫరాజ్ తెలిపాడు. జింబాబ్వే-పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరగనుంది.
రెండు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం టీమిండియా ఐర్లాండ్‌తో తలపడింది. ఈ నేపథ్యంలోనే తొలి టీ 20లో ప్రత్యర్థిపై భారీ తేడాతో భారత్ శుభారంభం చేసింది. ఆ తర్వాత భారత్-ఐర్లాండ్‌ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరగనుంది. అనంతరం జులై 3 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది.